విమానం వద్దని.. రైల్లోనే వెళ్లిన ఎంపీ

10 Apr, 2017 14:07 IST|Sakshi
విమానం వద్దని.. రైల్లోనే వెళ్లిన ఎంపీ

తాను విమానాలలో ఎక్కకుండా విధించిన నిషేధాన్ని విమానయాన సంస్థలు ఎత్తేసినా, ఉస్మానాబాద్ ఎంపీ రవీంద్ర గైక్వాడ్ మాత్రం విమానం కాకుండా రైల్లోనే ప్రయాణిస్తున్నారు. తాజాగా ఆయన ముంబై నుంచి ఢిల్లీ వెళ్లేందుకు విమానం కాకుండా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలే ఎక్కారట. ఆయన ఆ రైలును ముంబై సెంట్రల్ స్టేషన్‌లో ఎక్కారో లేదా బోరివాలిలో ఎక్కారో తనకు తెలియదు గానీ, రైల్లోనే ఢిల్లీ వెళ్లారని.. పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకు ఢిల్లీలోనే ఉంటారని ఎంపీ సన్నిహిత సహచరుడైన జితేంద్ర షిండే మీడియాకు చెప్పారు.

పార్లమెంటులో తీవ్ర గందరగళం అనంతరం పౌర విమానయాన మంత్రిత్వశాఖ గైక్వాడ్ మీద నిషేధాన్ని ఎత్తేయాల్సిందిగా ఎయిరిండియాకు సూచించింది. దాంతో ఎయిరిండియాతో పాటు ఇతర ప్రైవేటు విమానయాన సంస్థలు సైతం ఆయనను తమ విమానాల్లోకి ఎక్కించుకోడానికి అభ్యంతరం ఏమీ లేదంటూ నిషేధాన్ని ఎత్తేశాయి. అయితే, ఆయన ముందుగానే రైల్లో టికెట్ రిజర్వు చేసుకున్నారని, ఆయనతో పాటు నలుగురైదుగురు సహాయకులు కూడా ఉన్నారని షిండే చెప్పారు. విమాన ప్రయాణంలో జరిగిన గొడవ మొత్తం ఇప్పుడు సర్దుమణిగిందని, ఆ గొడవ కారణంగా ఆయనేమీ విమాన ప్రయాణం మానుకోవడం లేదని అన్నారు. పుణె నుంచి గానీ, ముంబై నుంచి గానీ గైక్వాడ్ ఢిల్లీ వెళ్లే విమానాలు ఏవీ ఎక్కలేదని ఎయిరిండియా వర్గాలు కూడా నిర్ధారించాయి.

మరిన్ని వార్తలు