అస్సాంలో పేట్రేగిన మిలిటెంట్లు... 23 మంది మృతి

3 May, 2014 02:52 IST|Sakshi
అస్సాంలో పేట్రేగిన మిలిటెంట్లు... 23 మంది మృతి

* ఏకే 47 తుపాకులతో విరుచుకుపడ్డ ముష్కరులు
* చివురుటాకుల్లా వణికిన కోక్రాఝర్, బక్సా జిల్లాలు
* కనిపిస్తే కాల్చివేతకు ప్రభుత్వం ఆదేశం..

 
 గువాహటి: అస్సాంలో బోడోలాండ్ తీవ్రవాదులు పేట్రేగిపోయారు. బోడోలాండ్ ప్రాంతం పరిధిలోని రెండు అత్యంత సున్నితమైన జిల్లాల్లో భీకర దాడులకు తెగబడ్డారు. గురువారం అర్ధరాత్రి నుంచి జరిపిన విచక్షణా రహిత కాల్పుల్లో మొత్తం 23 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు చిన్నారులు, 11మంది మహిళలు ఉన్నారు. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ హఠాత్పరిణామంతో ఉలిక్కిపడ్డ అస్సాం సర్కారు ఆయా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. వివరాలు..
 
 ఎన్‌డీఎఫ్‌బీ-ఎస్(నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్-సొంగ్‌బిజిత్)కు చెందిన 40 మంది మిలిటెంట్లు శుక్రవారం తెల్లవారుజామున కోక్రాఝర్ జిల్లాలోని బలపరా-1 గ్రామంలోని మూడు ఇళ్లలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. వీరిలో మైనారిటీ వర్గానికి చెందిన ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు.
 పొరుగున ఉన్న బక్సా జిల్లాలో గురువారం అర్ధరాత్రే తొలుత దాడులకు దిగిన మిలిటెం ట్లు.. జరిపిన కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోగా, పలువురు గాయపడ్డారు. ఇదే జిల్లాలో మరో వ్యక్తిని కూడా మిలిటెంట్లు కాల్చి చంపారు.
 
 బక్సా జిల్లాలోని నాంకేఖాద్రాబరి, నయాంగురి గ్రామాల్లో బుల్లెట్ల ధాటికి ప్రాణాలు కోల్పోయిన 12 మంది మృత దేహాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వీరిలో ఐదుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారన్నారు. ఇదే జిల్లాలోని మానస్ జాతీయ పార్కు సమీపంలో బేకి నదీ ఒడ్డున ఉన్న మైనార్టీ వర్గాలకు చెందిన 70 ఇళ్లను మిలిటెంట్లు తగలబెట్టారు.
 
 ఈ ఘటనలతో ఉలిక్కిపడ్డ అస్సాం సర్కారు కోక్రాఝర్, బక్సా జిల్లాల్లో కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా చిరాంగ్ జిల్లాలో నిరవధిక కర్ఫ్యూ విధించింది. అలాగే బక్సా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం 6 నుంచి తెల్లవారు జామున 4గంటల వరకు కర్ఫ్యూ విధించారు.  
 ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో ఫోన్‌లో మాట్లాడి అదనపు బలగాలను పంపాలని కోరారు. రాష్ట్రానికి అన్నిరకాలుగా సాయం చేస్తామని షిండే చెప్పారు. దాడులకు పాల్పడిన ఎన్‌డీఎఫ్‌బీ మిలిటెంట్లపై ఉక్కుపాదం మోపాలని కేంద్రం ఆదేశించింది.

మరిన్ని వార్తలు