-

కువైట్‌ కార్మికులకు క్షమాభిక్ష

24 Jan, 2018 01:21 IST|Sakshi

జరిమానా లేకుండానే స్వదేశానికి వెళ్లే అవకాశం

భారతీయ కార్మికులకు భారీ ఉపశమనం

ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 22 వరకే అవకాశం  

న్యూఢిల్లీ: కువైట్‌లో అక్రమంగా ఉంటున్న వేలాది మంది భారతీయులకు పెద్ద ఊరటనిస్తూ ఆ దేశ ప్రభుత్వం మంగళవారం క్షమాభిక్షను ప్రకటించింది. కువైట్‌లో ఇన్నాళ్లూ అక్రమంగా ఉన్నందుకు వారిపై ఎలాంటి జరిమానాలు విధించబోమని ప్రభుత్వం చెప్పింది. కువైట్‌లోని ఖరాఫీ నేషనల్‌ అనే కంపెనీలో పనిచేయడానికి వెళ్లిన అనేక మంది భారతీయులకు వేతనాలు అందలేదు. దీంతో వీసా గడువు ముగిసినప్పటికీ తమ వేతనాలు రాబట్టుకునేందుకు అనేక మంది కార్మికులు అక్కడే ఉండిపోయారు.

వీరంతా అక్రమంగా కువైట్‌లో నివసిస్తున్నందున రోజుకు రూ.424 జరిమానాగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. అసలే జీతం లేక ఇబ్బందులు పడుతున్న వీరికి జరిమానాలు చెల్లించడం తలకు మించిన భారంగా ఉంది. ఈ నేపథ్యంలో కువైట్‌ ప్రభుత్వం వీరికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అక్రమంగా కువైట్‌లో ఉంటున్నవారు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 22 మధ్య క్షమాభిక్షను వినియోగించుకుని భారత్‌కు వెళ్లిపోవచ్చంది.

వీరిపై ఎలాంటి జరిమానా విధించబోమంది. దీంతో ఎంతో మంది భారతీయ కార్మికులు వేతనాలపై ఆశ వదులుకుని మళ్లీ తమ కుటుంబాలతో కలసి గడిపేందుకు స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు మొత్తం వేతనాలు చేతికి అందితేగానీ వెనక్కు రాకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

తెలుగు కార్మికులూ ఎక్కువే..
ఇప్పుడు క్షమాభిక్ష పొందిన వారు మరోసారి కువైట్‌కు చట్టబద్ధంగా వెళ్లి పనిచేసుకోవడానికి కూడా అర్హులు. ప్రస్తుతం కువైట్‌లో అక్రమంగా నివసిస్తున్న వారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు కూడా భారీ సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఖరాఫీ నేషనల్‌ కంపెనీ కూడా భారత కార్మికులను సంప్రదించి వేతనాల్లో 25 నుంచి 33 శాతం సొమ్మును చెల్లించేందుకు ముందుకొచ్చినట్లు తెలిసింది.

అయితే కార్మికులు అందుకు ఒప్పుకోకుండా తమకు పూర్తి వేతనాలు చెల్లించాల్సిందేనని కోరుతున్నారు. వీరి సమస్య పరిష్కారం కోసం పోరాడిన సామాజిక కార్యకర్త షాహీన్‌ సయ్యద్‌ మాట్లాడుతూ ‘భారత కార్మికులకు ఇది గొప్ప ఉపశమనం’ అని అన్నారు. ఇటీవలే విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ కువైట్‌లో పర్యటించిన నేపథ్యంలో కువైట్‌ తాజాగా క్షమాభిక్షను ప్రకటించడం గమనార్హం. భారతీయ కార్మికుల అవస్థల గురించి వీకే సింగ్‌ కువైట్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు