యడ్యూరప్పకు బీజేపీ వార్నింగ్

1 May, 2017 08:40 IST|Sakshi
యడ్యూరప్పకు బీజేపీ వార్నింగ్

కర్ణాటకలో గొడవలు పడుతున్న బీజేపీ వర్గాలు రెండింటికీ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా గట్టి షాకిచ్చారు. సీనియర్ నాయకుడు, పార్టీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప వర్గానికి చెందిన ఇద్దరితో పాటు ఆయన ప్రత్యర్థి కేఎస్ ఈశ్వరప్ప వర్గానికి చెందిన మరో ఇద్దరిపై కూడా వేటు వేశారు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన తర్వాత ఈ రెండు వర్గాలు ఒకరిపై ఒకరు బురద జల్లుకున్నారు. ఎవరికి వాళ్లు అవతలి వర్గంపై చర్య తీసుకోవాలని అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం రెండు వారాల పర్యటన కోసం జమ్ము కశ్మీర్‌లో ఉన్న అమిత్ షా.. పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జి మురళీధర్ రావుతో సంప్రదించి రెండు వర్గాలకు చెందిన ఇద్దరిద్దిరిని పార్టీ నుంచి తొలగించారు. పార్టీ ఉపాధ్యక్షులు భానుప్రకాష్, నిర్మల్ కుమార్ సురానా, రైతు మోర్చా ఉపాధ్యక్షుడు ఎంపీ రేణుకాచార్య, అధికార ప్రతినిధి జి.మధుసూదన్‌లను అన్ని బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఏమైనా సమస్యలుంటే పార్టీ అంతర్గత వేదికలపై చూసుకోవాలి గానీ, వాటిని రోడ్డుమీదకు తీసుకెళ్లడం ఏ పార్టీకైనా ఆరోగ్యకరం కాదని, అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని మురళీధర్ రావు అన్నారు. వచ్చే సంవత్సరం కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి తాము అధికారంలోకి రావాలని బీజేపీ కలలు కంటోంది. దక్షిణాదిన తమకు అధికారం అందించిన ఏకైక రాష్ట్రం కావడంతో మళ్లీ కర్ణాటకను చేజిక్కించుకోవాలని కమలనాథులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి తరుణంలో పార్టీ నాయకుల మధ్య విభేదాలు రావడం మంచిది కాదని భావిస్తున్నారు. యడ్యూరప్ప కేవలం తన అనుచరులకే మేలు చేస్తూ ఎప్పటినుంచో పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను వదిలేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పార్టీకి సంబంధం లేకుండా దళితులు, వెనకబడిన వర్గాలను ఐక్యం చేసేందుకంటూ కురుబ వర్గానికి చెందిన కేఎస్ ఈశ్వరప్ప ఇటీవల ఓ భారీ సమావేశం నిర్వహించారు. అలా చేయొద్దని యడ్డి హెచ్చరించినా ఆయన వినిపించుకోలేదు. ఆ సమావేశంలో లింగాయత్ నాయకుడైన యడ్యూరప్పపై పలువురు మండిపడ్డారు. యడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని ఈశ్వరప్ప అంటున్నారు. అమిత్ షా స్వయంగా ఆయనను పార్టీ అధ్యక్షుడిగా, కాబోయే ముఖ్యమంత్రిగా ప్రకటించినప్పుడు తామంతా సంతోషించామని, కానీ అంతమాత్రాన ఆయన ఏం అనుకుంటే అది చేస్తానంటే మాత్రం కామ్‌గా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు