హక్కుల కార్యకర్తల అరెస్టుపై తీర్పు నేడే!

28 Sep, 2018 05:57 IST|Sakshi

న్యూఢిల్లీ: వరవరరావు సహా ఐదుగురు హక్కుల కార్యకర్తలను తక్షణం విడుదల చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు తీర్పు ఇచ్చే అవకాశముంది. మహారాష్ట్రలో గతేడాది జరిగిన ఎల్గర్‌ పరిషత్‌ సమావేశం, ఆ తర్వాత చెలరేగిన భీమా–కోరేగావ్‌ అల్లర్ల నేపథ్యంలో వరవరరావు, సుధా భరద్వాజ్, అరుణ్‌ ఫెరీరా, గౌతమ్‌ నవలఖ, వెర్మన్‌ గంజాల్వెజ్‌లను పుణె పోలీసులు ఈ ఏడాది ఆగస్టులో అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టులను సవాలుచేస్తూ చరిత్రకారిణి రొమీలా థాపర్, ఆర్థికవేత్త ప్రభాత్‌ పట్నాయక్, దేవకీ జైన్, ప్రొ.సతీశ్‌ దేశ్‌పాండేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

హక్కుల కార్యకర్తలను వెంటనే విడుదల చేయడంతోపాటు ఈ ఘటనపై సమగ్ర విచారణ కోసం సిట్‌ను నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో వరవరరావు సహా ఐదుగురు హక్కుల కార్యకర్తలను పోలీసులు ఆగస్టు 29 నుంచి గృహనిర్బంధంలో ఉంచారు. ఈ కేసులో తీర్పును ఈ నెల 20న రిజర్వు చేసిన సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం.. శుక్రవారం తుది తీర్పును వెలువరించే అవకాశముంది.

మరిన్ని వార్తలు