వెనుతిరిగిన తృప్తి దేశాయ్‌

17 Nov, 2018 11:50 IST|Sakshi

తిరువనంతపురం : భక్తుల శరణు ఘోషతో మారుమోగాల్సిన అయ్యప్ప సన్నిధానం నిరసనకారుల నినాదాలతో హోరెత్తుతోంది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన తరువాత శబరిమల ఆలయాన్ని ఇప్పటికి మూడు సార్లు తెరిచారు. కానీ ప్రతి సారి అయ్యప్ప సన్నిధానం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా వార్షిక మండల దీక్ష సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నిన్నటి నుంచి శబరిమల ఆలయాన్ని తెరిచారు.

ఈ సందర్భంగా తాను శబరిమలలో ప్రవేశించి.. అయ్యప్ప స్వామిని దర్శించుకునే తీరతానని శపథం చేసి శుక్రవారం కొచ్చి చేరుకున్నారు సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్‌. కానీ నిరసనకారులు ఆమెను కొచ్చి విమానాశ్రయం వద్దే అడ్డుకున్నారు. ఆలయానికి వెల్లనిచ్చేది లేదని తేల్చి చెప్పారు. 14 గంటల నిరసనల అనంతరం తృప్తి దేశాయ్‌, ఆమెతో పాటు వచ్చిన మరో 6గురు కార్యకర్తలు ముంబై తిరుగు ప్రయాణమయ్యారు. అయితే వీరికి ముంబై విమానాశ్రయంలో కూడా నిరసనల సెగ తగిలింది.

ఎందుకు ఇంత అత్యుత్సాహం : తస్లిమా నస్రీన్‌
ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌ వివాదాస్పద రచయిత్రి తస్లిమా నస్రీన్‌ శబరిమల వివాదంపై స్పందించారు. ‘మహిళా కార్యకర్తలంతా శబరిమల ఆలయాన్ని సందర్శించడానికి ఎందుకు ఇంత అత్యుత్సాహం చూపిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. శబరిమల బదులు గ్రామాలకు వెళ్లి అక్కడ మహిళ పట్ల జరుగుతున్న గృహహింస, అత్యాచారం, వేధింపులు, నిరక్షరాస్యత, సమాన వేతనం, ఆరోగ్యం, ఉద్యోగం చేసే స్వేచ్ఛ వంటి అంశాల గురించి పోరాడితే మంచిది’ అంటూ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు