సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అనుమానాస్పద మృతి

23 Dec, 2019 08:08 IST|Sakshi

బెంగళూర్‌ : ప్రముఖ అనువాదకులు, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్‌ జీ నంజుండన్‌ బెంగళూర్‌లోని తన నివాసంలో శనివారం విగతజీవిగా కనిపించారు. 58 ఏళ్ల నంజుండన్‌ నాలుగు రోజుల కిందట గుండెపోటుతో మరణించారని అనుమానిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. నాగదేవనహల్లిలోని నివాసంలో కుళ్లిన స్ధితిలో ఆయన మృతదేహాన్ని గుర్తించామని వెల్లడించారు. బెంగళూరు యూనివర్సిటీలో స్టాటిస్టిక్స్‌ లెక్చరర్‌గా పనిచేసే నంజుండన్‌ కొద్దిరోజులుగా విధులకు గైర్హాజరయ్యారని, ఆయనను చూసేందుకు అసిస్టెంట్‌ వచ్చిన క్రమంలో ఈ ఘటన వెలుగుచూసిందని చెప్పారు. ఆ సమయంలో చెన్నైలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా భార్య, కుమారుడు హుటాహుటిన బెంగళూర్‌కు చేరుకున్నారని తెలిపారు. కాగా, ఆయన దాదాపు 12 పుస్తకాలను కన్నడ నుంచి తమిళంలోకి అనువదించి విశేష ప్రాచుర్యం పొందారు. పలు కన్నడ మహిళా రచయితల కథలను అకా పేరుతో ఆయన తమిళంలోకి అనువదించినందుకు నంజుండన్‌కు 2012లో సాహిత్య అకాడమి బహుమతి లభించింది.

మరిన్ని వార్తలు