ఉప్పు రైతుల్లో..కలవరం

14 Apr, 2018 12:59 IST|Sakshi
ఉమాలో సాగులో ఉన్న ఉప్పు పంట 

వర్షం పడే ఆవకాశం ఉందన్న వాతావరణ శాఖ

భయాందోళనలో కర్షకులు

బరంపురం : గంజాం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ శుక్రవారం జారీ చేసిన హెచ్చరికలతో జిల్లాలోని ఉప్పు రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలే వారం రోజులుగా పడుతున్న అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో వాతావరణ శాఖ హెచ్చరికలతో ఉప్పు రైతులు మరింత భయాందోళనకు గురవుతున్నారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఉరుములు, మెరుపులతో కురిసిన తేలికపాటి వర్షాలకే చాలా నష్టపోయాం. ఇప్పుడు ఐఎండీ(ఇండియన్‌ మెట్రాలజీ డివిజన్‌) జారీ చేసిన హెచ్చరికలతో భయాందోళనకు గురవుతున్నామని వర్షాలు పడితే తీవ్రంగా నష్టపోతామని వాపోయారు.  

పదివేల కుటుంబాలకు ఆధారం

జిల్లాలో సుమారు 10వేల ఉప్పు రైతుల కుటుంబాలున్నాయి. రెండువేలకు పైగా ఎకరాల్లో ఉప్పు పంటను సాగుచేస్తున్నారు. వీరికి ఉప్పు పంట తప్ప ఇంకో జీవనాధారం లేదు. వాతావరణ హెచ్చరికల ప్రకారం వర్షాలు పడితే పంట మొత్తం నీట మునిగి నాశనమైతే జీవనం సాగించడం కూడా కష్టతరంగా మారుతుంది. రెండువేల ఎకరాల్లో పండించిన పంటలో సుమారు 40 శాతం పంటను తీశామని రైతులు చెబుతున్నారు.

ఇంకా 60 శాతం ఉండిపోవడంతో తీవ్ర అందోళనకు గురవుతున్నామన్నారు. గతంలో వచ్చిన ఫైలీన్‌ తుఫాన్‌ ప్రభావానికి రెండు వేల ఎకరాల్లో పంట మొత్తం నీట మునగడంతో తీవ్ర నష్టపోయామని తెలిపారు. 

ప్రభుత్వం ఆదుకోవాలి

జనవరి మొదటి వారంతో ప్రారంభమయ్యే ఉప్పు సీజన్‌ జూన్‌ మొదటి వారంతో ముగుస్తుంది. ప్రస్తుతం ఎండ అధికంగా తగలితే ఉప్పు పంట దిగుబడి మరింతగా వస్తుంది. ధర కూడా ఆశాజనకంగా ఉన్న తరుణంలో వారం రోజులుగా పడిన వర్షాలకు పంట నష్టంతో పాటు ధర కూడా తగ్గిపోయింది.  దీనికి తోడు సోమవారం నుంచి వర్షాలు పడితే తీవ్రంగా నష్టపోతామని రైతులు వాపోతున్నారు.

ఇటువంటి తరుణంలో ప్రభుత్వం దృష్టి సారించి తగు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. జరగబోయే నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేసి ఉప్పు రైతులను ఆదకోవాలని ఉప్పు సహకార సమితి కార్యదర్శి బొటొ కృష్ణ రెడ్డి విజ్ఙప్తి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు