విమానంలో పేలిన ఫోన్

24 Sep, 2016 03:46 IST|Sakshi
విమానంలో పేలిన ఫోన్

సమన్లు జారీ చేసిన డీజీసీఏ
న్యూఢిల్లీ: శామ్‌సంగ్‌కు చెందిన నోట్ 2 ఫోన్ శుక్రవారం ఇండిగో విమానంలో పేలి పొగలు వచ్చాయి. సింగపూర్ నుంచి చెన్నైకి వచ్చిన విమానం ఉదయం 7.45 గంటలకు ల్యాండ్ అవుతుండగా ఘటన జరిగింది. సిబ్బంది వెంటనే అగ్నిమాపక పరికరంతో మంటలను ఆర్పేయడంతో విమానంలో ఉన్న 175 మంది ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. 6ఈ-054 విమానంలో 23సీ సీటు దగ్గర ఉన్న అల్మారా నుంచి పొగలు వస్తున్నట్లు గుర్తించిన సిబ్బంది పరిస్థితిని గురించి ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)కు సమాచారమిచ్చారు.

అనంతరం అల్మారా తెరిచి చూడగా ఒక ప్రయాణికుడి బ్యాగ్‌లో ఉన్న నోట్ 2 ఫోన్ నుంచి పొగలు వస్తుండడంతో దానిపై అగ్నిమాపక పరికరాన్ని ప్రయోగించి అనంతరం వాష్ రూంలో నీళ్లు ఉన్న ఒక పాత్రలో ఉంచారు. ముందు జాగ్రత్త చర్యగా 23సీ దగ్గర్లో ఉన్న ప్రయాణికులను ఇతర సీట్లకు మార్చారు. అనంతరం ఏ అవాంతరాలూ లేకుండా, ప్రమాదం జరగకుండా విమానం భద్రంగా కిందకు దిగింది. ఘటనపై విచారణను ఎదుర్కొనేందుకు సోమవారం తమముందు హాజరు కావాలంటూ పౌర  విమానయాన డెరైక్టరేట్ జనరల్ (డీజీసీఏ) శామ్‌సంగ్‌కు సమన్లు జారీ చేసింది. ప్రయాణికులు శామ్‌సంగ్ నోట్ సీరీస్ ఫోన్లను విమానాల్లో వాడ కుండా చూడాలని విమానయాన సంస్థలను డీజీసీఏ కోరింది. ఘటనపై విచారిస్తామని శామ్‌సంగ్ తెలిపింది. భారత్‌లో విమానాల్లో శామ్‌సంగ్ ఫోన్‌కు నిప్పుంటుకోవడం ఇదే ప్రథమం.

మరిన్ని వార్తలు