ఎన్డీఎంఏకు శశిధర్‌రెడ్డి రాజీనామా

20 Jun, 2014 07:18 IST|Sakshi
ఎన్డీఎంఏకు శశిధర్‌రెడ్డి రాజీనామా

సాక్షి, న్యూఢిల్లీ: కొందరు గవర్నర్ల తర్వాత ఇప్పుడు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) ఉపాధ్యక్షుడు ఎం.శశిధర్‌రెడ్డి వంతు. పదవుల నుంచి తప్పుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఆయనతో పాటు సంస్థకు చెందిన ఐదుగురు సభ్యులు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. జాతీయ మహిళా కమిషన్, ఎస్టీ, ఎస్సీ కమిషన్, భారత సాంస్క­ృతిక సంబంధాల మండలి (ఐసీసీఆర్)ల అధిపతులు, సభ్యులను సైతం రాజీనామా చేయూల్సిందిగా కేంద్రం ఆదేశించినట్లు సమాచారం. శశిధర్‌రెడ్డితో పాటు ఎన్డీఎంఏ సభ్యులుగా వ్యవహరిస్తున్న సీఐఎస్‌ఎఫ్ మాజీ డెరైక్టర్ జనరల్ కె.ఎం.సింగ్, పౌర విమానయూన శాఖ మాజీ కార్యదర్శి కె.ఎన్.శ్రీవాస్తవ, మేజర్ జనరల్ (రిటైర్డ్) జె.కె.బన్సల్, బాబా అణు పరిశోధన సంస్థ (బార్క్) మాజీ డెరైక్టర్ బి.భట్టాచార్జీ, సీబీఐ మాజీ ప్రత్యేక డెరైక్టర్ కె.సలీం అలీ రాజీనామాలు చేశారు.
 
 ‘ప్రధాని ఎన్డీఎంఏని పునర్వ్యవస్థీకరించేందుకు వీలుగా మంగళవారమే రాజీనామా లేఖను పంపా. అది ఆయన పరిశీలనలో ఉండి ఉంటుంది. రాజీనామా చేయాలని నాకు ఎవరూ ఫోన్ చేయలేదు. ఎవరి ఒత్తిడీ లేదు. స్వచ్ఛందంగానే రాజీనామా చేశా. సంస్థ పునర్నిర్మాణ కార్యక్రమం త్వరలోనే పూర్తవుతుందని భావిస్తున్నా..’ అని శశిధర్‌రెడ్డి గురువారం నాడిక్కడ సంస్థ కార్యాలయంలో మీడియూకు తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కొనసాగే వరకు బాధ్యతల్లో కొనసాగుతానన్నారు. 2005లో ఎన్డీఎంఏ సభ్యుడిగా నియమితులైన శశిధర్‌రెడ్డి, 2010 డిసెంబర్‌లో సంస్థ ఉపాధ్యక్షుడిగా పదోన్నతి పొందారు.

మరిన్ని వార్తలు