జమ్ము కశ్మీర్‌పై సుప్రీం కీలక ఉత్తర్వులు

16 Sep, 2019 12:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్‌లో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయన్న పిటిషనర్ల వాదనపై సర్వోన్నత న్యాయస్ధానం స్పందించింది. జమ్ము కశ్మీర్‌పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. కశ్మీర్‌కు స్వయంగా తాను వెళ్లేందుకు చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ సిద్ధమయ్యారు. మరోవైపు కశ్మీర్‌ వెళ్లేందుకు పిటిషనర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌కు కోర్టు అనుమతించింది. నాలుగు జిల్లాల్లో పర్యటించి అక్కడి పరిస్థితిని తమకు నివేదించాలని సుప్రీం కోర్టు కోరింది. కశ్మీర్‌లో ప్రస్తుతం ప్రసారం అవుతున్న వార్త ఛానెల్స్, పత్రికలపై అఫిడవిట్ దాఖలు చేయాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను  సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. 

శ్రీనగర్, అనంత నాగ్,బారాముల్లా, జమ్మూ జిల్లాల్లో పర్యటించేందుకు గులాం నబి ఆజాద్ కి సుప్రీంకోర్టు అనుమతించింది. ర్యాలీలు, స్పీచ్ లు, రాజకీయ కార్యక్రమాలు జరపరాదని షరతు విధించింది. పిటిషన్ దాఖలు చేసేందుకు హైకోర్టు అందుబాటులో ఉందా లేదా అనే దానిపై నివేదిక సమర్పించాలని జమ్మూ కశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక కశ్మీర్‌లో అంతా సవ్యంగా ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు నివేదిక ఇచ్చిన క్రమంలో అక్కడి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆస్పత్రికి కూడా వెళ్లలేని దుర్భర పరిస్థితులు అక్కడ నెలకొన్నాయని పిటిషనర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌ పరిణామాలపై గులాం నబీ ఆజాద్‌ దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు సీతారాం ఏచూరి ఇతరులు దాఖలు చేసిన పిటిషన్‌లను సర్వోన్నత న్యాయస్ధానం సోమవారం విచారించింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా