సీఏఏపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

22 Jan, 2020 11:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై స్టే విధించేందుకు సర్వోన్నత న్యాయస్ధానం నిరాకరించింది. ఈ చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నాలుగు వారాల్లోగా స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేంద్రం వాదనను వినకుండా సీఏఏపై స్టే ఉత్తర్వులు ఇవ్వబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీఏఏను వ్యతిరేకిస్తూ దాఖలైన 140 పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తుందని కోర్టు తెలిపింది. సీఏఏ రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన 143 పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని బెంచ్‌ విచారణకు స్వీకరించింది.

సీఏఏపై విచారణ నేపథ్యంలో పెద్దసంఖ్యలో ప్రజలు తరలివస్తున్న క్రమంలో తాము ఛాంబర్స్‌లో వాదనలు వింటామని, న్యాయవాదులు ఛాంబర్లకు రావచ్చని ప్రధాన న్యాయమూర్తి బాబ్డే సూచించారు. కాగా కేంద్రం తరపున హాజరైన అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ తన వాదనలను వినిపిస్తూ సీఏఏపపై దాఖలైన 143 పిటిషన్లలో 60 పిటిషన్‌లకు సంబందించిన కాపీలను ప్రభుత్వానికి అందించారని, తమకు కాపీలు ఇవ్వని పిటిషన్లపై స్పందించేందుకు ప్రభుత్వానికి తగినంత సమయం ఇవ్వాలని కోరారు. మరోవైపు సీఏఏపై నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వాలని, జాతీయ జనాభా రిజిస్టర్‌ (ఎన్‌పీఆర్‌)లను కొంతకాలం పాటు వాయిదా వేయాలని పిటిషనర్ల తరపు న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోర్టును కోరారు.

చదవండి : బ్యాట్‌ పట్టిన సీజే బాబ్డే.. టాప్‌ స్కోరర్‌

మరిన్ని వార్తలు