మీ పిల్‌లో అర్జెంట్‌ కనిపించడంలేదు: సుప్రీం

6 Jan, 2017 13:59 IST|Sakshi
బడ్జెట్‌ ఆపే పిల్‌పై అర్జెంట్‌ లేదన్న సుప్రీం

న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్‌ను ఎన్నికల నేపథ్యంలో ఆపించే ఉద్దేశంతో దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసర వాదనల కిందట విచారించేందుకు సుప్రీంకోర్టు కోర్టు నిరాకించింది. పిటిషన్‌ విచారించే సమయం వచ్చినప్పుడే విచారిస్తామని స్పష్టం చేసింది. ఇటీవల ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, మణిపూర్ రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఎన్నికలు ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ఫిబ్రవరి 4 ప్రారంభం కానుంది.

ఈలోగా కేంద్రం ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు బడ్జెట్‌ ప్రవేశ పెట్టకుండా ఆపేయాలని కావాలంటే మార్చి 15 తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవచ్చంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎంఎల్‌ శర్మ అనే న్యాయవాది ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. ఈ పిల్‌ను అత్యవసరంగా విచారించాలంటూ కోరారు. అయితే దీనిని పరిశీలించిన చీఫ్‌ జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ ఈ పిటిషన్‌లో తనకు అత్యవసరం ఏమీ కనిపించడం లేదని, దీనిపై విచారణ సమయం వచ్చినప్పుడు విచారిస్తామంటూ న్యాయవాదికి తెలిపారు.

మరిన్ని వార్తలు