గుజరాతీ ఎడిటర్‌పై దేశద్రోహం కేసు

13 May, 2020 16:13 IST|Sakshi

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లోని ఓ న్యూస్‌ పోర్టల్‌ ఎడిటర్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. బీజేపీ అధిష్టానం గుజరాత్‌లో నాయకత్వ మార్పు చేసే అవకాశం ఉందనే వార్తకు సంబంధించి పోలీసులు ఈ కేసు నమోదుచేశారు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన ఫేస్‌ ఆఫ్‌ నేషన్‌ అనే న్యూస్‌ పోర్టల్‌కు ధావల్‌ పటేల్‌ అనే వ్యక్తి ఎడిటర్‌గా ఉన్నారు. మే 7వ తేదీన ఆ న్యూస్‌ పోర్టల్‌లో ప్రచురితమైన ఓ ఆర్టికల్‌లో గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీని తొలగించి ఆయన స్థానంలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాను నియమించే ఆలోచనలో బీజేపీ అధినాయకత్వం ఉందని పేర్కొన్నారు. కరోనాను అదుపు చేయడంలో విజయ్‌ రూపానీ విఫలం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలిపారు. అయితే ఈ వార్తలను కేంద్ర మంత్రి మన్సుఖ్‌ మాండవియా ఖండించారు. (చదవండి : సుప్రీంకోర్టు సెల‌వుల ర‌ద్దు!)

ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 124(ఏ) కింద ధావల్‌పై దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఈ మేరకు సోమవారం ధావల్‌ను అహ్మదాబాద్‌లోని ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు. ‘ధావల్‌ తన వెబ్‌ పోర్టల్‌ ద్వారా రాష్ట్రంలో, సమాజంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు పూర్తిచేశారు. ఆ తర్వాత ధావల్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు’ అని అహ్మదాబాద్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ ఏసీపీ బీవీ గోహిల్‌ తెలిపారు. 

అయితే ధావల్‌పై పోలీసు చర్యను ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా ఖండించింది. దేశంలోని పలుచోట్ల జర్నలిస్టులను ఇబ్బంది పెట్టేలా క్రిమినల్‌ చట్టాలను దుర్వినియోగపరచడం పెరుగుతోందని ఎడిటర్స్‌ గిల్డ్‌ అభిప్రాయపడింది. (చదవండి : మొద‌టి రైలు: నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న)

మరిన్ని వార్తలు