పద పదవే వయ్యారి.. పావురమా..!

16 Apr, 2018 21:17 IST|Sakshi

ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాలు హవా సాగుతున్న ప్రస్తుత తరుణంలోనూ ఒడిశా పోలీసులు రాజుల కాలం నాటి పాత పద్ధతి కనుమరుగుకాకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అదే పావురాళ్లతో సందేశాలు, వర్తమానాలు పంపించడం... మొఘల్‌ రాజుల కాలంలో ఈ విధానాన్ని విస్తృతంగా ఉపయోగించారు. యుద్ధక్షేత్రాలతో పాటు అంతఃపురాల్లోకి రహస్యసమాచారాన్ని చేరవేసేందుకు ఈ పద్ధతిని పాటించారు. ఇండియన్‌ నేషనల్‌ ట్రస్ట్‌ ఫర్‌ ఆర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ (ఇంటాక్‌) భువనేశ్వర్‌  సహకారంతో ఒడిశా పోలీసులు ఇటీవల ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించారు.  చారిత్రక వారసత్వ పరిరక్షణకు సంబంధించిన సందేశాలు పంపించేందుకు ఈ ప్రయోగం చేశారు. దీని కోసం  భువనేశ్వర్‌ నుంచి 25 కిలోమీటర్ల దూరమున్న కటక్‌కు 50 పావురాళ్లను పంపించారు. గంటలోపే ఇవన్నీ గమ్యస్థానం కటక్‌ చేరుకున్నాయి. 

అయితే ఒడిశాకు ఓ ప్రత్యేకత ఉంది. వైర్‌లెస్, టెలిఫోన్‌ లింక్‌లు లేని ప్రాంతాల్లో సమాచార వ్యవస్థను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు 1946లో 200 పావురాళ్లతో కూడిన ‘ఒడిశా పావురాళ్ల సర్వీసు’ ను పోలీసుసిబ్బందికి సైన్యం అందజేసింది. మొదట కొండలతో కూడుకున్న కోరాపుట్‌ జిల్లా లో దీనిని ప్రారంభించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో పాటు దీనిని విశ్వసనీయమైనదిగా భావించడంతో ఆ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 700 బెల్జియన్‌ హోమర్‌ పావురాళ్లతో సందేశాలు పంపించే డ్యూటీని కొనసాగించారు. కొన్నేళ్ల పాటు మారుమూల ప్రాంతాల్లోని పోలీస్‌స్టేషన్ల మధ్య సంబంధాలు, సమాచార మార్పిడికి ఈ విధానం ఉపయోగపడింది. ఒక చిన్న కాగితం ముక్కపై రాసిన సందేశాన్ని ఓ ప్లాస్టిక్‌ క్యాప్సుల్‌లో పెట్టి ఈ పావురాళ్ల కాళ్లకు కట్టేవారు. ఇవి 15 నుంచి 25 నిమిషాల్లోనే 25 కి.మీ దూరం ప్రయాణిస్తాయి. ఈ రకం పావురాళ్ల జీవితకాలం 20 ఏళ్ల వరకు ఉండేది. 1982లో వరదల్లో బాంకీ పట్టణం చిక్కుకున్నపుడు,  1999లో సూపర్‌ సైక్లోన్, వరదల సందర్భంగా కూడా కటక్‌ కేంద్రంగా ఈ సర్వీసు ఉపయోగించారు. 
–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
 

మరిన్ని వార్తలు