లింగ నిష్పత్తిలో గ్రామాలే మెరుగు

4 Mar, 2017 05:02 IST|Sakshi
లింగ నిష్పత్తిలో గ్రామాలే మెరుగు

న్యూఢిల్లీ: దేశంలో లింగ నిష్పత్తిలో గ్రామీణ ప్రాంతాలు పట్టణాల కన్నా మెరుగైన స్థానంలో ఉన్నట్లు  తాజా సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా లింగ నిష్పత్తి(ప్రతి వేయి మంది పురుషులకు స్త్రీల సంఖ్య) 991 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇది 1,009గా ఉండగా పట్టణాల్లో 956గా ఉందని 2015–16 ఏడాదికి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–4(ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్‌–4) పేర్కొంది. జనన సమయంలో లింగనిష్పత్తి దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో 914 నుంచి 919కి పెరగ్గా పట్టణ ప్రాంతాల్లో 899గా నమోదైందని తెలిపింది.

హరియాణాలో జనన సమయంలో లింగ నిష్పత్తి 762(2005–06) నుంచి 836కి పెరిగిందని తెలిపింది. కాని అక్కడి గ్రామాల్లో మాత్రం ఇది 785కే పరిమితమైంది.  మధ్యప్రదేశ్‌లో గత ఐదేళ్లలో జనన సమయంలో లింగ నిష్పత్తి 927కి తగ్గింది. పట్టణాల్లో ఇది 899. ఆ రాష్ట్రంలో మొత్తం లింగ నిష్పత్తి 973 కాగా గ్రామాల్లో ఇది 933గా నమోదైంది. రాజస్తాన్  గ్రామాల్లో లింగ నిష్పత్తి 973 కాగా, పట్టణాల్లో  928గా ఉంది. లింగ నిష్పత్తిలో పట్టణాలు, ఇతర ప్రాంతాల మధ్య అంతరం అస్సాంలో స్పష్టంగా కనిపించింది. ఈ రాష్ట్రంలో గత ఐదేళ్లలో మొత్తం లింగ నిష్పత్తి 929గా నమోదైంది.

మరిన్ని వార్తలు