సాయిబాబా దేవుడు కాదా?...

24 Jun, 2014 14:13 IST|Sakshi
సాయిబాబా దేవుడు కాదా?...

వివాదాలు కొనితెచ్చుకోవడంలో రాజకీయ నాయకులతో ప్రస్తుతం బాబాలు పోటీ పడుతున్నారు. తాజాగా ద్వారక శంకరాచార్య స్వరూపానంద సరస్వతి మరోసారి వార్తల్లోకి ఎక్కారు.  తాను సాధువునన్న సంగతి మర్చిపోయి ఇటీవలే ఓ పాత్రికేయుడిపై చేయి చేసుకున్న స్వామివారు... ఈసారి ఏకంగా షిర్డీ సాయిబాబానే టార్గెట్ చేశారు.

షిర్డీ సాయిబాబు దేవుడు కాదని, మనిషిని దేవుడిగా పూజించవద్దంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా షిర్డీసాయి దేవుడు కాడని, ఆయనకు ఆలయాలు కట్టడం సరికాదని సెలవిచ్చారు. పనిలో పనిగా హిందువులను విభజించేందుకే అంతర్జాతీయ శక్తులు బాబాను సీన్లోకి తెచ్చాయని స్వరూపనంద సరస్వతి వ్యాఖ్యలు చేశారు.

సనాతన ధర్మంలో విష్ణువుకు సంబంధించి కలియుగంలో 24 అవతారాలను చెప్పారని, కల్కి, బుద్ధ తప్ప ఇతర అవతారాల గురించి చెప్పలేదని, స్వరూపనంద సరస్వతి చెప్పుకొచ్చారు.  మనిషిని దేవుడుగా కొలవడం తప్పని ఆయన స్పష్టం చేశారు. హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీకగా సాయిబాబాను గుర్తించడానికి కూడా ఆయన నిరాకరించారు. కాగా స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యలపై సాయి భక్తులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్వరూపానంద ప్రచారం కోసమే ఈ వివాదాన్ని తెరమీదకు తెచ్చారని మండిపడుతున్నారు.

కాగా  స్వరూపానంద సరస్వతి గతంలోనూ వార్తల్లో నిలిచారు. నరేంద్ర మోడీని విమర్శించిన బీహార్ సీఎం నితీష్ కుమార్తో కలిసి విరాట్ రామాయణ్ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొని చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి స్వరూపానంద సరస్వతి తన నోటి దురుసుతో మరోసారి పతాక శీర్షికలకు ఎక్కారు.

 

మరిన్ని వార్తలు