‘ఇలా చేసి అచ్రేకర్‌ని అవమానించారు’

4 Jan, 2019 17:30 IST|Sakshi

ముంబై : క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ కోచ్‌, ద్రోణాచార్య పురస్కార గ్రహీత రమాకాంత్ అచ్రేకర్ బుధవారం ముంబైలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే అచ్రేకర్‌ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించలేదంటూ శివసేన పార్టీ.. మహారాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. ఇక నుంచి మహారాష్ట్ర  ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనకుండా బహిష్కరించాలంటూ సచిన్‌ను కోరింది.

ఈ సందర్భంగా శివసేన సీనియర్‌ నాయకుడు సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ.. ‘పద్మశ్రీ, ద్రోణాచార్య అవార్డు గ్రహీత అయిన రమాకాంత్ అచ్రేకర్‌ అంత్యక్రియలను ఎందుకు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించలేదం’టూ ప్రశ్నించారు. ‘మహారాష్ట్ర ప్రభుత్వం అచ్రేకర్‌ని నిర్లక్ష్యం చేసింది. ఇందుకు నిరసనగా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనకుండా సచిన్ వాటిని బహిష్కరించాలి’ అని ఆ పిలుపునిచ్చారు. అచ్రేకర్‌ మరణానంతరం శివసేన పార్టీ పత్రిక సామ్నాలో ఆయన సేవలను కొనియాడుతూ ఓ కథనాన్ని కూడా ప్రచురించింది.

అలాగే ఆయన అంత్యక్రియలు నిర్వహించిన తీరుపై విమర్శలు చేసింది. ఇది క్రికెట్‌కు అచ్రేకర్‌ చేసిన సేవలను తక్కువ చేయడమే కాకుండా, ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తుందని మండిపడింది. శివసేనతో పాటు పలువురు సీనియర్‌ నాయకులు కూడా ఈ విషయం గురించి అసహనం వ్యక్తం చేశారు. అచ్రేకర్‌కు ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించకపోవడం బాధకరం అన్నారు.

87 ఏళ్ల అచ్రేకర్‌ బుధవారం సాయంత్రం ముంబయిలోని తన స్వగృహంలో కన్నుమూశారు. గత సంవత్సరం గురు పూర్ణిమ రోజున సచిన్‌.. అచ్రేకర్‌ను కలిసి కృతజ్ఞతలు చెప్పారు. క్రికెట్‌లో సాధించిన విజయాలకు తన గురువు అందించిన ప్రోత్సాహమే కారణమని ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. దానికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు సచిన్‌.


Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు