జయలలిత బంగ్లాలో అస్తిపంజరం

28 Jun, 2017 13:34 IST|Sakshi
జయలలిత బంగ్లాలో అస్తిపంజరం
టీనగర్‌ : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఒకప్పుడు తన గెస్ట్‌హౌస్‌గా ఉపయోగించుకున్న సిరుతాపూర్ బంగ్లా వద్ద అస్తిపంజరం కనిపించడం ప్రకంపనలు కలిగిస్తోంది. బంగ్లాలో గస్తీ కాస్తున్న సాయుధ పోలీసులకు సోమవారం అస్తిపంజరం కనిపించింది. దీంతో ఒక్క సారిగా కలకలం రేగింది. జయలలిత బంగ్లా వెనుక భాగంలో సెక్యూరిటీగా పనిచేస్తున్న వ్యక్తి అవశేషాలుగా తెలుస్తోంది. ఆస్థి వ్యవహారంలో భాగంగా ఈ హత్య జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఆమె మృతి చెందిన తర్వాత పోయెస్‌గార్డెన్, సిరుతాపూర్‌, కొడనాడు ప్రాంతాల్లో పోలీసు భద్రత తగ్గించారు. ప్రస్తుతం సిరుదావూరు బంగ్లాలో సాయుధ పోలీసులు మాత్రమే గస్తీ కాస్తున్నారు. ఇలా ఉండగా ఆ ప్రాంతంలో మనిషి అస్తిపంజరం కనిపించింది. దీంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు.  
 
కాగా చెన్నై నగరానికి సుమారు 70-80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బంగ్లాకు జయలలిత అప్పుడప్పుడు విడిది కోసం మాత్రం వెళ్లేవారు. ప్రస్తుతం ఈ బంగ్లా శశికళ, దినకరన్ కుటుంబీకుల ఆధీనంలో ఉంది. వాళ్ల కుటుంబ సభ్యులే ఆ బంగ్లాలో ఉంటున్నారు. శశికళ జైలుకు వెళ్లిన తర్వాత దినకరన్ కుటుంబ సభ్యులు అందులో ఉంటూ బంగ్లాను చూసుకుంటున్నారు. అయితే గత ఏప్రిల్‌ లో బంగ్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన నాటికి దినకరన్‌ ను పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో ప్రమాదంపై అనుమానాలు కలిగాయి. జయలలిత ఆస్తులకు సంబంధించి విలువైన పత్రాలు ఈ బంగ్లాలో ఉన్నట్టు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి.
 
మరిన్ని వార్తలు