సియాచిన్ జవాన్లకు స్మృతి రాఖీ

19 Aug, 2016 02:46 IST|Sakshi
సియాచిన్ జవాన్లకు స్మృతి రాఖీ

జమ్మూ/తవాంగ్: కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లు గురువారం రాఖీ పౌర్ణమి సందర్భంగా దేశ సరిహద్దుల్లోని సైనికులకు రాఖీ కట్టారు. ప్రపంచంలోనే ఎత్తై యుద్ధభూమి సియాచిన్‌లో స్మృతి రాఖీ కట్టి, సైనికుల కృషిని అభినందించారు. సియాచిన్‌లోని ఒక మంచుదిబ్బ అంచున ఉన్న బేస్‌క్యాంపుకు ఆమె ఉదయం 9.22 గంటలకు ఆకాశమార్గంలో చేరుకున్నారు. సియాచిన్ యుద్ధ స్మారకం వద్ద స్మృతి పూలమాల ఉంచారు. తర్వాతజవాన్లనుద్దేశించి మాట్లాడారు. స్వలాభం, కుటుంబాల గురించి ఆలోచించకుండా సేవ చేస్తున్న సైనికులు దేశానికి గర్వకారణమన్నారు.

తన తల్లి స్వయంగా తయారుచేసిన మిఠాయిలను సైనికులకు పంచిపెట్టారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అరుణాచల్‌ప్రదేశ్ తవాంగ్ జిల్లా లుమ్లాలో సైనికులకు రాఖీ కట్టారు. ఈ కార్యక్రమం రూపొందించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మహిళా మంత్రులను సరిహద్దులకు పంపి, కచ్చితంగా సైనికులకు రాఖీ కట్టేలా మోదీ చూశారనీ, తద్వారా మహిళలకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందనే సందేశాన్ని జాతికి ఇచ్చారని ఆమె కొనియాడారు.

మరిన్ని వార్తలు