‘సోలార్’ రాయితీ 5 వేల కోట్లు

31 Dec, 2015 01:02 IST|Sakshi
‘సోలార్’ రాయితీ 5 వేల కోట్లు

కేంద్ర కేబినెట్ ఆమోదం
♦ ఐదేళ్లలో 4,200 మెగావాట్ల రూఫ్‌టాప్ సౌర విద్యుత్ వ్యవస్థలు
♦ రైల్వే ప్రాజెక్టుల అమలుకు రైల్వే-రాష్ట్రాల జాయింట్ వెంచర్
♦ స్మార్ట్ సిటీల అభివృద్ధికి బ్లూమ్‌బర్గ్ సంస్థతో ఒప్పందానికి ఓకే
 
 న్యూఢిల్లీ: స్వచ్ఛ ఇంధన వినియోగాన్ని పెంపొందించే కృషిలో భాగంగా.. ఇంటి పైకప్పులు, చిన్న సౌర విద్యుత్ ప్లాంట్లను అనుసంధానించే గ్రిడ్‌కు అందించే ఆర్థిక సాయాన్ని (రాయితీని) రూ. 600 కోట్ల నుంచి దాదాపు పది రెట్లు పెంచుతూ రూ. 5,000 కోట్లు కేటాయించాలన్న నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జాతీయ సోలార్ మిషన్ కింద వచ్చే ఐదేళ్లలో 4,200 మెగావాట్ల సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థలు స్థాపించటానికి ఈ నిధులు దోహదం చేస్తాయి. ఈ పథకం కింద సాధారణ తరగతి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 30 శాతం పెట్టుబడి రాయితీ, ప్రత్యేక తరగతి రాష్ట్రాలకు 70 శాతం పెట్టుబడి రాయితీ అందిస్తారు. ప్రైవేటు రంగంలో వాణిజ్య, పారిశ్రామిక ప్లాంట్ల స్థాపనకు ఇతరత్రా ప్రయోజనాలు ఉన్నందున వాటికి రాయితీలు వర్తించవు. కేంద్ర కేబినెట్ బుధవారం ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. వివిధ విభాగాలు వేర్వేరుప్రకటనల్లో తెలిపిన వివరాల ప్రకారం కేబినెట్ నిర్ణయాలివీ...

► రైల్వే ప్రాజెక్టుల అమలులో రాష్ట్రాలు మరింత ఎక్కువగా ఆర్థిక పాత్ర పోషించేలా.. వివిధ రాష్ట్రాలతో రైల్వే శాఖ జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేయటానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికింద రైల్వే శాఖ ఒక్కో రాష్ట్రానికి అందించే ఆరంభ పెట్టుబడిపై రూ. 50 కోట్లకు పరిమితి విధించారు. ప్రాజెక్టును బట్టి మొత్తం రూ. 100 కోట్ల ఆరంభ పెట్టుబడితో జాయింట్ వెంచర్‌ను ప్రారంభిస్తారు. ప్రాజెక్టుకు అనుమతి వచ్చాక అవసరమైన నిధులను ఆ సంస్థకు అందిస్తారు.
► భారత్-కెనడాలకు చెందిన ఉన్నత విద్యా సంస్థల మధ్య సహకారానికి గల శక్తిసామర్థ్యాలను గుర్తిస్తూ.. సహకారంపై అవగాహనా ఒప్పందాన్ని మరో ఐదేళ్లు పొడిగించేందుకు ఆమోదం తెలిపారు.
► ‘బ్రిక్స్’ దేశాల మధ్య వర్సిటీల అనుసంధానంపై గత నవంబర్‌లో మాస్కోలో జరిగిన బ్రిక్స్ దేశాల విద్యాశాఖ మంత్రులు, సీనియర్ అధికారుల సమావేశంలో చర్చించి సంతకాలు చేసిన ఎంఓయూకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
► ఆఫ్రికా, యురేసియాల్లో రాబందులు, గద్దలు, గుడ్లగూబలు, డేగలు తదితర 76 జాతుల వలస పక్షుల పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి ‘రాప్టర్ ఎంఓయూ’పై భారత్ సంతకం చేయటానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
► స్మార్ట్ సిటీల అభివృద్ధికి మద్దతు కోసం న్యూయార్క్‌కు చెందిన బ్లూమ్‌బర్గ్ ఫిలాంత్రపీస్ సంస్థతో భాగస్వామ్యంపై ఎంఓయూకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
► ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత్ - జోర్డాన్‌ల మధ్య సహకారానికి కుదిరిన ఎంఓయూకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
► ఈ ఏడాది నవంబర్ 13 నుంచి అమలులోకి వచ్చిన ఇండియా - ఆస్ట్రేలియాల మధ్య పౌర అణు సహకార ఒప్పందం అమలు కోసం పరిపాలనాపరమైన ఏర్పాట్లను కేంద్ర మంత్రివర్గం సమీక్షించింది.
 
 సత్వరమే పూర్తి చేయాలి
 హైదరాబాద్ మెట్రోపై మోదీ

 హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలని ప్రధాని మోదీ సూచించారు. పలు రాష్ట్రాల్లోని వివిధ రోడ్డు, రైల్వే, మెట్రో రైల్, విద్యుత్, ఆహార శుద్ధి రంగాల్లోని కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులపై ఆయన బుధవారం ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ‘ప్రగతి (క్రియాశీల పాలన, నిర్దిష్ట సమయంలో అమలు)’ ఎనిమిదో సమావేశంలో సమీక్షించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును సత్వరమే ఉత్తమ నాణ్యతతో పూర్తిచేయాలని సంబంధిత అధికారులందరికీ నిర్దేశించారు. అలాగే ఈస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, ఢిల్లీ - హరియాణా - ఉత్తరప్రదేశ్ ఈస్ట్రన్ పెరిఫెరల్ కారిడార్‌ల పైనా సమీక్షించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద నేరుగా ప్రయోజన బదిలీ (నగదు బదిలీ)లో, లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థను సంపూర్ణంగా కంప్యూటరీకరించటంలో ప్రగతిపైనా ప్రధాని సమీక్షించారు.

మరిన్ని వార్తలు