'మత్స్యకారుల భద్రతకు ప్రత్యేక పథకం'

26 Feb, 2015 02:41 IST|Sakshi
'మత్స్యకారుల భద్రతకు ప్రత్యేక పథకం'

లోక్‌సభలో ఎంపీ పొంగులేటి ప్రశ్నకు కేంద్రం సమాధానం
 సాక్షి, న్యూఢిల్లీ: ప్రాదేశిక జలాల్లో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోందని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ తెలిపారు. ఈ పథకంలోభాగంగా జీపీఎస్, సమాచార వ్యవస్థ, ఎకో సౌండర్, సెర్చ్, రెస్క్యూ వంటివి అమల్లో ఉన్నాయని వివరించారు. కచ్ఛతీవు ద్వీపంలో ఘర్షణల వ్యవహారంపై శ్రీలంకతో చర్చలు, సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు మరో ఎంపీ బుధవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు బదులిచ్చారు.
 
 జాతీయ స్కిల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీపై పొంగులేటి, మరి కొం దరు ఎంపీలు అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి రాజీవ్‌ప్రతాప్ రూఢీ లిఖితపూర్వత సమాధానమిచ్చారు. కేంద్రం లోని 20 మంత్రిత్వ శాఖల విభాగాలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. 12వ పంచవర్ష ప్రణాళిక ప్రకారం వ్యవసాయేతర రంగాల్లో 5 కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. జనవరి 2015-మార్చి 2017 మధ్య 3.29కోట్ల మందిని నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి చెప్పారు.

>
మరిన్ని వార్తలు