గౌన్లు వేసుకున్నాం.. కానీ అక్కడికి వెళ్లం!

25 Dec, 2019 15:36 IST|Sakshi

సీఏఏకు వ్యతిరేకంగా వినూత్న నిరసన

కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర జాబితా(ఎన్నార్సీ)కు వ్యతిరేకంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్న వేళ ఓ విద్యార్థిని వినూత్న పద్ధతిలో నిరసన తెలియజేశారు. పట్టా పుచ్చుకున్న అనంతరం వేదిక మీదే సీఏఏ కాపీని చింపివేశారు. వివరాలు.. పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవం మంగళవారం జరిగింది. ఇందులో భాగంగా యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ వివిధ విభాగాల విద్యార్థులకు పట్టాలు, పతకాలు ప్రదానం చేశారు. ఈ క్రమంలో డెబోస్మిత చౌదరి అనే విద్యార్థినిని వేదిక మీదకు పిలిచారు. ఎమ్‌ఏ పట్టాను ఆమెకు ప్రదానం చేశారు. అయితే ఒక్క నిమిషం ఆగాల్సిందిగా వేదిక మీద ఉన్న పెద్దలను కోరిన డెబోస్మిత.. తన చేతిలో ఉన్న సీఏఏ కాపీను ముక్కముక్కలుగా చింపివేశారు. ‘మేం కాగితాలు చూపించము. ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ అంటూ నినాదాలు చేశారు.
(చదవండి : పౌరసత్వ చట్టం: ఎందుకీ ఆందోళనలు?)

ఈ విషయం గురించి డెబోస్మిత మాట్లాడుతూ... ‘ఇందులో తికమకపడాల్సింది ఏమీ లేదు. జాదవ్‌పూర్‌ యూనివర్సిటీపై నాకు గౌరవం ఉంది. నా అభిమాన విద్యా సంస్థ నుంచి పట్టా అందుకోవడం గర్వంగా ఉంది. అయితే సీఏఏపై నాకు, నా స్నేహితులకు ఉన్న వ్యతిరేకతను చాటేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాను’ అని పేర్కొన్నారు. ఇక డెబోస్మితతో పాటు మరికొంత మంది విద్యార్థులు సైతం ఇదే విధంగా నిరసన తెలిపారు. ‘ కాన్వొకేషన్‌ గౌన్లు వేసుకున్నాం. కానీ మా పేర్లు పిలిచినపుడు స్టేజీ మీదకు వెళ్లం. ఇలా మా నిరసనను తెలియచేస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు. 

మరిన్ని వార్తలు