సచివాలయానికి రాని ఏకైక వ్యక్తి కేసీఆర్‌: శ్రవణ్‌

25 Dec, 2019 15:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణాలో రెండోసారి కొలువు తీరిన కేసీఆర్ ప్రభుత్వం పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిందని జాతీయ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌ నిప్పులు చెరిగారు. మంగళవారం  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకోవడంపై గాంధీభవన్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆచరణకు నోచుకోని సంక్షేమ పథకాలతో జనాన్ని బురిడీ కొట్టించిన ఘనత సీఎంకు దక్కుతుందన్నారు. మాయమాటలతో మభ్యపెడుతూ ఫామ్ హౌస్ కే పరిమితమైన చరిత్ర ఒక్క కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని, ప్రజలపై మోయలేని భారాన్ని మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలనా పరంగా చూస్తే మొదటి ఏడాది అంతా పూర్తిగా నిరాశ పరిచిందన్నారు.

వడ్డీలు కట్టడమే సరిపోతుంది.. ఇక అభివృద్ధి ఏం చేస్తారు..
రాష్ట్ర అభివృద్ధి పేరుతో ఇప్పటి దాకా 3 లక్షల కోట్లకు పైగా అప్పులు తీసుకు వచ్చారని, వీటికి వడ్డీలు కట్టడంతోనే సరిపోతోందన్నారు. ఏకంగా రుణాల కోసం ప్రభుత్వ సంస్థలను కూడా తాకట్టు పెట్టిందన్నారు. అంతే కాకుండా ఈ అప్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆయా రుణ మంజూరు సంస్థలకు పూచీకత్తుగా ఉంటుందని ఆరోపించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకే పెద్ద మొత్తంలో రుణాలు తీసుకువచ్చారని ఆరోపించారు.

మ్యానిఫెస్టోలోని హామీలను నెరవేర్చడంలో విఫలం..
అంచనాలను పెంచి అడ్డగోలుగా ప్రాజెక్టులకు కేటాయించిన ఘనత కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ కొడుతున్న ఒక్క మద్యం ద్వారా దాదాపు రూ. 20వేల కోట్లు ఆదాయం గడించిన ప్రభుత్వం, ఎక్సైజ్‌ శాఖ తప్ప మిగతా ఏ రంగాలపై దృష్టి సారించలేదని విమర్శించారు. 2018 ఎన్నికలలో టీఆర్ఎస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. ఖాళీలను భర్తీ చేయడం లేదా కొత్తగా ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని,  గ్రూప్ -1, గ్రూప్ -2 పరీక్షలను ప్రభుత్వం నిర్వహించడంలో విఫలమైందని ఆయన తెలిపారు.

అక్షరాస్యత పరంగా ఇండియాలో తెలంగాణ చాలా వెనుకబడి ఉందని, ఈ విషయాన్ని 2011 జనగణన సూచించిందని పేర్కొన్నారు. బడ్జెట్ పరంగా చూస్తే అమలులో దేశంలో 31వ ర్యాంక్ లో ఉందని ఆర్బీఐ పేర్కొన్నట్లు తెలిపారు. ప్రజా ఆరోగ్యంలో మిగతా రాష్ట్రాలు మెరుగైన సేవలందిస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం పట్టించుకోవడం లేదని వివరించారు. మొత్తం బడ్జెట్లో ఆరోగ్య రంగానికి ప్రభుత్వం 3.50 శాతం మాత్రమే కేటాయించినందని గుర్తుచేశారు. దేశంలో సచివాలయానికి రాని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అని దుయ్యబట్టారు.

మరిన్ని వార్తలు