‘మతి’ పోయింది.. ఇపుడు ఓకే!

25 Dec, 2019 15:22 IST|Sakshi
బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారో (ఫైల్‌ పోటో)

సావోపోలో : బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారో (64) తాత్కాలికంగా జ్ఞాపకశక్తిని కోల్పోయారట. ఈ విషయాన్నిస్వయంగా అధ్యక్షుడు ఒక​ ఇంటర్వ్యూలో వెల్లడించారు.  చికిత్స అనంతరం ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానేవుందని చెప్పొకొచ్చారు. ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ హాస్పిటల్‌లో చికిత్స అనంతరం తన అధికారిక నివాసంలో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాని ఆయన తెలిపారు. 

బొల్సొనారో అందించిన  వివరాల ప్రకారం తన అధికారిక నివాసంలో జారి కిందపడటంతో ఆయన తలకు బలంగా దెబ్బ తగిలింది. అల్వొరాడా ప్యాలెస్‌లో బాత్‌రూమ్‌లో జారిపడ్డారు. అయితే పడిపోయిన వెంటనే ఏమీ గుర్తు లేదు..జ్ఞాపకశక్తిని కోల్పోయాననీ అధ్యక్షుడు తెలిపారు.  ఉదాహరణకు నిన్న ఏం చేశానో,  ఏం జరిగిందో గుర్తు లేదు. ఆ తర్వాతి రోజు నుంచి నెమ్మదిగా, పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోగలుగుతున్నా..ఇప్పుడు క్షేమంగానే ఉన్నానని బ్యాండ్ టెలివిజన్‌కు ఇచ్చిన టెలిఫోన్‌ ఇంటర్వ్యూలో తన ఆరోగ్య పరిస్థితిని ఆయన వివరించారు. కానీ వయసుతోపాటు, కత్తిపోటు (అధ్యక్ష పదవికి పోటీ సందర్భంగా 2018 సెప్టెంబర్‌లో గుర్తు తెలియని వ్యక్తి కత్తితోదాడి చేశాడు) గాయం వల్ల కొన్ని సమస్యలు ఇంకా వున్నాయన్నారు.

కాగాఈ ఏడాది జ‌న‌వ‌రిలో బొల్సొనారో అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో ఆయ‌న్ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తి  కడుపులో క‌త్తితో పొడిచారు. ఈ గాయానికి చికిత్సలో భాగంగా ఇప్పటికే  నాలుగు సార్లు స‌ర్జ‌రీ కూడా చేయించుకున్నారు. అలాగే స్కిన్ క్యాన్స‌ర్‌కు చికిత్స తీసుకున్నానని ఈ నెల ప్రారంభంలో బోల్సొనారో వెల్లడించిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు