కొంగుపట్టి అర్థిస్తున్నా: సుమలత అంబరీశ్‌

17 Apr, 2019 07:35 IST|Sakshi

మండ్య : ‘ఈ నాలుగు వారాల ప్రచారాల్లో ఎన్నో అవమానాలు, అవహేళనలు, బెదిరింపులు ఎదుర్కొన్నా. వాటన్నింటిని మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చా. సీఎం కుమారస్వామి అంబరీశ్‌ మృతిని కూడా రాజకీయాలకు వాడుకుంటూ ఎన్నికల్లో విమర్శలు చేస్తున్నారు’ అని మండ్య స్వతంత్ర అభ్యర్థి సుమలత ఆరోపించారు. ఆమె మంగళవారం మండ్య పట్టణంలో నిర్వహించిన స్వాభిమాన సమ్మేళన ర్యాలీ, సభలో సుమలతతో పాటు సినీ హీరోలు యశ్,దర్శన్‌లు జేడీఎస్‌పై తీవ్రస్థాయిలో మాటల తూటాలు పేల్చారు. సీఎం కుమారస్వామి ఆనాడు భద్రతా సమస్యల వల్ల అంబరీష్‌ భౌతికకాయాన్ని మండ్యకు తీసుకురాకూడదు, 500 బస్సుల్లో అభిమానులను బెంగళూరుకు తీసుకెళ్దాం అంటే తానే వద్దు, మండ్యకు తీసుకు వెళ్లాలని పట్టుబట్టానన్నారు. 

అంబరీశ్‌కు శ్రద్ధాంజలి ఘటించే సమయంలో మీకు సోదరుడిగా జీవితాంతం తోడుగా ఉంటామని హామీ ఇచ్చిన మీరు ఇప్పుడు అదే అంబరీశ్‌ సమాధిపై మీ తనయుడి రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రశ్నించారు. అంబరీశ్‌ పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనూ అంబరీశ్‌ను ఓడించడానికి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ సీనియర్‌ నేత కుట్రలు చేశారంటూ పరోక్షంగా మంత్రి డీకే శివకుమార్‌పై విమర్శలు గుప్పించారు. తనకు మద్దతిచ్చిన కాంగ్రెస్‌ కార్యకర్తలపై కక్షసాధింపునకు పాల్పడుతున్నాన్నారు.  

స్వాభిమానాన్ని గెలిపించండి  
మండ్య జిల్లా ప్రజలపై నమ్మకంతో ఎన్నికల్లో నిల్చున్నామని ఎన్నికల్లో మద్దతు తెలిపి స్వాభిమానాన్ని, మీపై పెట్టుకున్న నమ్మకాన్ని గెలిపించాలంటూ సుమలత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజాసేవకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు అంబరీశ్‌ లేరనే ధైర్యంతో ప్రేలాపనలు చేస్తున్నారంటూ విమర్శించారు. తనకు ఓటేసి గెలిపించాలని భావోద్వేగంతో కొంగుపట్టి అర్థించారు. ఈ కార్యక్రమంలో హీరోలు యశ్, దర్శన్, సుమలత తనయుడు అభిషేక్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు