నవ్విన చోటే నిలిచి.. గెలిచి..!

27 Oct, 2017 07:13 IST|Sakshi
ఆరేళ్ల క్రితం సుమతి ప్రయత్నంతో తవ్విన కొలను

గ్రామీణ మహిళ భగీరథయత్నం

అన్నాహజారే, రాజేంద్రసింగ్‌ స్ఫూర్తి

స్వచ్ఛందసంస్థల సహకారంతో తాగునీటి సమస్య పరిష్కరించిన వైనం

తాగునీటి కోసం గ్రామీణ మహిళల కష్టాలు ఆమెను కదిలించాయి. నీటి సమస్య పరిష్కారానికి ఎన్నో మార్లు అధికారులకు విన్నవించారు. స్వచ్ఛంద సేవలను ఆశ్రయించారు. తన నగలను తాకట్టు పెట్టి మçహారాష్ట్ర, రాజస్తాన్‌  వెళ్లారు. అన్నాహజరే, రాజేంద్రసింగ్‌ల సలహాలు తీసుకున్నారు. మొదట ఓ కొలను తవ్వారు. ఈ ప్రయత్నానికి  కొందరు నవ్వుకున్నారు.ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నా కుంగిపోలేదు. కొలను నిండడంతో పరిసరాల్లో భూగర్భజలాలు కొంత మేరకు పెరిగాయి. అదే స్ఫూర్తితో స్వచ్ఛంద సంస్థల, యువత సహకారం తీసుకుని మరో ఎనిమిదికొలనులు తవ్వించారు.  ప్రస్తుతం కొలనులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. నవ్వినచోటే నిలిచి గెలిచారు తిరువళ్లూరు సమీపంలోని నల్లటూరు గ్రామానికి చెందిన సుమతి.

తిరువళ్లూరు: సాగర చక్రవర్తి అశ్వమేధయాగం చేయతలపెట్టగా ఇంద్రుడు ఆ అశ్వాన్ని దొంగిలించి కపిల మహర్షి దగ్గర కట్టేశాడట. ఆ ఆశ్వాన్ని చూసిన యువరాజులు ఆ మహర్షిని నిందించడంతో ఆగ్రహించిన రుషి వారందరిని భస్మం చేశాడట. నిజం తెలుసుకున్న సాగరచక్రవర్తి రెండో భార్య కుమారుడు అసమంజ రాజకుమారుల ఆత్మకు శాంతి ప్రసాదించాలని రుషిని ప్రార్థించగా.. దేవలోకం నుంచి గంగను భూమికి తీసుకువస్తే వారి ఆత్మకు శాంతి కలుగుతుందని తెలిపాడట. దీంతో అసమంజ మనవుడు భగీరథుడు కఠోర తపస్సు చేసి గంగను భూమి మీదకు తెచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఇదే విధంగా అదిగత్తూరు సమీపం 5 గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి భగీరథ యత్నమే చేసింది ఆమె. భర్త సహకారం, సమీప పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామ యువకులతో వర్షం నీటి ఆదాకు కొలను తవ్వకానికి నిధులు సేకరించారు. అలా పదేళ్ల క్రితం ప్రారంభించి ఇప్పటివరకు గ్రామంలో తొమ్మిది కొలనుల తవ్వించారు. పచ్చదనం కోసం రెండు వేల మొక్కలను నాటి శభాష్‌ అనిపించుకుంటున్నారు సమాజికవేత్త సుమతి.

కుటంబ నేపథ్యం..
తిరువళ్లూరు సమీపం, నల్లటూరు గ్రామానికి చెందిన సుమతి డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆమెకు 14 ఏళ్ల క్రితం చిదంబరనాథన్‌తో వివాహం జరిగింది. వివాహం జరిగిన మరుసటి రోజు నుంచే కన్నీటి కష్టాలు ఎదురయ్యాయి. తాగునీటి కోసం మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి వ్యవసాయబావి వద్ద తాగునీటిని తెచ్చుకోవాలి. ఇలా నీటికోసం పడిన కష్టాలు ఆమెను కదిలించాయి.

సమస్య పరిష్కారం ఆమె మాటల్లోనే..
ఈ శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టా. 2006లో నిర్వహించిన గ్రామసభలో ఏకాటూరు వద్ద ఉన్న కూవం నదిపై అనకట్ట కట్టాలని తీర్మానం చేశాం. అధికారులు సైతం వచ్చి వెళ్లినా పని కాలేదూ కదా.. మళ్లీ సమస్య ఉగ్రరూపం దాల్చింది. అప్పడే ఇండియా వాటర్‌మెన్‌ రాజస్థాన్‌కు చెందిన రాజేంద్రసింగ్, అన్నాహజారే గురించి పుస్తకాల్లో చదివా. గ్రామాల్లో నీటిని ఆదాచేయడానికి స్వచ్ఛంద సంసల సహకారంతో కొలను తవ్వారన్నది అందులోని సారాంశం. ప్రభుత్వాన్ని నమ్మి ప్రయోజనం లేదని నగలను తాకట్టు పెట్టి మహరాష్ట్ర, రాజస్తాన్‌కు బయలుదేరా. అన్నాహజరే, రాజేంద్రసింగ్‌ను కలిసి గ్రామంలోని తాగునీటి సమస్యను వివరించా. కొలను తవ్వి నీటిని ఆదా చేయమని చెప్పారు రాజేంద్రసింగ్‌. మొదట్లో నమ్మకం లేకపోయినా హజారే స్వగ్రామమైన రాలేగన్‌ సిద్ధి్ద, రాజస్థాన్‌లో తవ్విన కొలనులను పరిశీలించాక నమ్మకం ఏర్పడింది.

నిధుల కోసం వినతి..
గ్రామపంచాయతీ అధ్యక్షుడికి కొలను తవ్వకం కోసం నిధులను సేరించాలని కోరా. అయితే అందుకు అయ్యే ఖర్చును గుర్తుచేస్తూ నన్ను ఎగతాలి చేశారు. అయినా నేను గ్రామంలోని యువకులు, స్వచ్ఛంద సంస్థలు, సమీప కంపెనీలను ఆశ్రయించి నిధులు సేకరించా. ఆ నిధులతో తాగునీటి ట్యాంకర్‌ కోసం ఏర్పాటు చేసిన బోరుకు సమీపంలో పెద్ద కొలనును ఆరునెలల పాటు శ్రమించి తవ్వాం. కొలనుకు నాలుగు వైపులా రాళ్లను పేర్చాం. ఆ ఏడాదే మంచి వర్షం. కొలను నీటితో నిండి జలకళను సంతరించుకుంది. దీంతో భూగర్భజలాలు కొంత మేరకు పెరగడంతో ఆరు నెలల పాటు తాగునీటికి ఇబ్బంది లేకుండా పోయింది.

మొత్తం తొమ్మిది కొలనులు..
అదే జోష్‌తో మరో ఎనిమిది కొలనులను తవ్వాలని పనులు ప్రారంభించా. మొదట్లో మమ్మిల్ని ఎగతాళి చేసిన వారే మాతో చేతులు కలిపారు. ఏడాదికి ఒక కొలను చొప్పున ఎనిమిదింటిని పూర్తి చేశాం. ప్రస్తుతం గ్రామంలో తొమ్మిది కొలనులను తవ్వాం. ప్రవేటు వ్యక్తి చేతిలో ఆక్రమణకు గురైన మరో కొలనును స్వాధీనం చేసుకుని మరమ్మతులు చేశాం. కొలనుల తవ్వడానికి తాను చేసిన ప్రయత్నంలో ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నప్పుడు కొంచెం బాధపడ్డా. కానీ కొలనుల్లో నీరు నిండి ప్రవహిస్తుండడంతో పలువురు శభాష్‌ అంటూ ప్రశంసిస్తుంటే ఆ బాధను మరిచిపోతున్నా.

భర్త సహకారం..
సుమతి సాధించిన విజయం వెనుక భర్త చిదంబరనాథన్‌ ప్రోత్సహం, యువకుల సహకారం ఎంతో ఉంది. ప్రస్తుతం అదే టీం లక్ష మొక్కలను నాటాలని నిర్ణయించి రెండువేల మొక్కలను నాటి పరిరక్షిస్తున్నారు. సుమతి సమాజసేవకు గాను పలు అవార్డులు వచ్చాయి. గ్రామస్తులు సైతం పంచాయతీ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించారు. అయితే ఎన్నికలు నిలిచిపోయాయి. భవిష్యత్‌లో పంచాయతీ అధ్యక్షురాలిగా ఎన్నికై సమాజ సేవ చేయాలని ఆశిద్దాం.

మరిన్ని వార్తలు