అలహాబాద్‌ పేరు మార్పుపై సుప్రీం నోటీసు

20 Jan, 2020 14:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని అలహాబాద్‌ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు సోమవారం నాడు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. అలహాబాద్‌ హెరిటేజ్‌ సొసైటీ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ భారత ప్రధాన న్యాయమూర్తి నేతత్వంలోని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన త్రిసభ్య బెంచీ ముందుకు వచ్చింది. 
(చదవండి: వామ్మో! ఇన్ని పేర్లు ఎలా మార్చగలం ?)

అలహాబాద్‌ పేరును ప్రయాగ్‌రాజ్‌గా 2018, అక్టోబర్‌ నెలలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌ నిర్ణయం ద్వారా మార్చారు. దాన్ని నాడు కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించారు. ‘గంగా, యమున సంగమం ప్రాంతంలో మొగల్‌ చక్రవర్తి అక్బర్‌ తన కోటను నిర్మించిన 16వ శతాబ్దానికి ముందు అలహాబాద్‌ను ప్రయాగ్‌గా పిలిచేవారు. నాడు ఆయన ప్రయాగ్‌ను ఇలాహాబాద్‌గా పేరు మార్చగా, ఆయన మనవడు షా జహాన్‌ దాన్ని అలహాబాద్‌గా మార్చారు. 

బ్రహ్మ దేవుడు ప్రయాగ్‌ వద్ద మొట్ట మొదటి యజ్ఞాన్ని నిర్వహించారు. రెండు నదులు కలిసే చోటును ప్రయాగ్‌ అంటారు. అలహాబాద్‌లో గంగా, యమున, సరస్వతి మూడు నదులు కలిశాయి. అందుకని అది ప్రయాగ్‌కు రాజ్‌ లాంటిది. కనుక ప్రయాగ్‌రాజ్‌ అయింది’ అని నాడు యోగి ఆదిత్యనాథ్‌ పేరు మార్పు వెనక కథనాన్ని వినిపించారు. 

అప్పుడు సోషల్‌ మీడియాలో ప్రయాగ్‌రాజ్‌గా పేరు మార్పుపై హాస్యోక్తులు వెల్లువెత్తాయి. ‘నీవు ఎక్కడ పుట్టావు ?’ అని ఒకరు ఒకరిని ప్రశ్నించగా, ‘ప్రయాగ్‌రాజ్‌’లో అంటూ సమాధానం. ‘ఏ కోచ్‌లో పుట్టావ్‌?’ అంటూ అనుబంధ ప్రశ్న. అప్పటికే ఢిల్లీ–అలహాబాద్‌ మధ్య తిరిగే రైలొకటి ‘ప్రయాగ్‌రాజ్‌’గా ప్రసిద్ధి చెందిన విషయం తెల్సిందే. 

మరిన్ని వార్తలు