శబరిమల, రాఫెల్‌పై తీర్పు నేడే

14 Nov, 2019 04:58 IST|Sakshi

సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం నేడు కీలక తీర్పులు ఇవ్వనుంది.

శబరిమల: ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి సంబంధించి దాఖలైన రివ్యూ పిటిషన్లపై....

రాఫెల్‌: యుద్ధ విమానాల ఒప్పందంలో అక్రమాలు, రాఫెల్‌ తీర్పుపై రాహుల్‌ చేసిన వ్యాఖ్య లకుగాను దాఖలైన ధిక్కరణ పిటిషన్‌లపై....

న్యూఢిల్లీ: దశాబ్దాలుగా నెలకొన్న అయో«ధ్య వివాదంపై ఇటీవల తుది తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం నేడు మరో మూడు కీలక అంశాలపై తీర్పు ఇవ్వనుంది. శబరిమలలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశం, రాఫెల్‌ యుద్ధవిమానాల ఒప్పందంలో అక్రమాలు, రాఫెల్‌ తీర్పుపై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలకుగాను దాఖలైన ధిక్కరణ పిటిషన్‌లపై గురువారం తీర్పునివ్వనుంది.  

శబరిమల వివాదం..
శబరిమలలో ఉన్న ప్రముఖ అయ్యప్పస్వామి ఆలయంలోకి రుతుక్రమం (10 నుంచి 50 మధ్య వయస్సు)లోని స్త్రీల ప్రవేశంపై నిషేధం ఉంది.  ఆలయంలోకి అన్ని వయస్సుల స్త్రీలను అనుమతిస్తూ 2018, సెప్టెంబర్‌ 28న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ అనేక రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ధర్మాసనం వీటిపై విచారణ జరిపి ఫిబ్రవరి 6న తీర్పును రిజర్వులో ఉంచింది.  

రఫేల్‌ వివాదం
రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు ఏమీ లేవని కేంద్ర ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ ఇస్తూ 2018 డిసెంబర్‌ 14న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అయితే, ఈ కొనుగోలు ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను అణచిపెట్టి సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందన్న ఆరోపణలతో, ఈ తీర్పుని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్‌ శౌరి, యశ్వంత్‌సిన్హా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై తీర్పుని మే 10న ధర్మాసనం రిజర్వ్‌లో పెట్టింది.  అలాగే రాఫెల్‌పై సుప్రీంకోర్టును తప్పుగా అన్వయిస్తూ ‘కాపలాదారు దొంగ’అని ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకుగాను దాఖలైన ధిక్కరణపై పిటిషన్‌పై కూడా ధర్మాసనం తీర్పు వెలువరించనుంది.

>
మరిన్ని వార్తలు