షరియా కోర్టులకు చట్టప్రతిపత్తిలేదు: సుప్రీం

8 Jul, 2014 04:07 IST|Sakshi
షరియా కోర్టులకు చట్టప్రతిపత్తిలేదు: సుప్రీం

* ఫత్వాల అమలు తప్పనిసరికాదు
* ఉభయపక్షాల సామరస్య పరిష్కారానికే షరియా కోర్టులని ధర్మాసనం స్పష్టం

న్యూఢిల్లీ: ముస్లిమ్ మత గురువులు ఆధ్వర్యంలో నడిచే షరియా కోర్టులకు ఎలాంటి చట్టబద్ధత లేదని, షరియా కోర్టుల నిర్ణయాలను తప్పనిసరిగా అమలుచేయాల్సిన అవసరంలేదని సుప్రీంకోర్టు సోమవారం రూలింగ్ ఇచ్చింది. ఫత్వాలపేరుతో అమాయకులను శిక్షించేందుకు వీలులేదని, మౌలికమైన మానవహక్కులకే అది భంగమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అమాయకులను శిక్షించాలని ఇస్లాం మతంతోపాటు ఏ మతమూ చెప్పదని పేర్కొంది. షరి యా కోర్టుల చట్టబద్ధతను ప్రశ్నిస్తూ న్యాయవాది విశ్వలోచన్ మాదం దాఖలు చేసిన ప్రజాశ్రేయో వ్యాజ్యంపై విచారణ సందర్బంగా కోర్టు రూలింగ్ ఇచ్చింది. జస్టిస్ సీకే ప్రసాద్, జస్టిస్ పినాకి చంద్రఘోష్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.
 
 ‘దార్-ఉల్-ఖాజా’ వంటి సంస్థలు తీర్పులు చెప్పడం, ఫత్వాలు జారీచేయడంపై  ఆంక్షలు విధించింది. ఎవరూ అడగకపోయినా ఓ వ్యక్తిపై, వ్యక్తులపై ఫత్వాల జారీ సరికాదని స్పష్టం చేసింది. అయితే,  ’దార్-ఉల్-ఖాజాల’ ఫత్వాలు జారీ చట్టవిరుద్ధమని ప్రకటించడానికి సుప్రీం నిరాకరించింది. షరియా కోర్టులు,.. రెండు పక్షాల మధ్య సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ఏర్పాటైన సంస్థలని, వాటి నిర్ణయాలను అంగీకరించడం, తిరస్కరించడం సంబంధిత వ్యక్తుల ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉందని పేర్కొంది. వ్యక్తులకు చట్టం ప్రకారం ధఖలుపడిన హక్కులకు భంగం కలగనంతవరకూ ఫత్వాల జారీలో ఎలాంటి తప్పూలేదని, అయితే, తన సమక్షంలో లేని వ్యక్తిపై ఫత్వా జారీ చేయరాదని సుప్రీంకోర్టు దార్-ఉల్-ఖాజాలను హెచ్చరించింది.
 
 ఫత్వాకు చట్టబద్ధత ఉండబోదని, ఫత్వాలను బలవంతంగా అమలుచేయడం కుదరదని ధర్మాసనం తన 20 పేజీల తీర్పులో స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుపై ముస్లిం మతగురువులు తీవ్రంగా స్పందించారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకారం పనిచేయడానికి, తగినచర్యలు తీసుకోవడానికి రాజ్యాంగమే తమకు అనుమతినిచ్చిందని వారన్నారు. న్యాయవ్యవస్థకు సమాంతరంగా తా ము ఎలాంటి పనీ చేయట్లేదని, ఒక ఖాజా జారీచేసే ఉత్తర్వులను అంతా తప్పనిసరిగా పాటించాలని తాము చెప్పలేదని ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు జఫర్‌యాబ్ అన్నారు. రాజ్యాంగ పరిధిలో ముస్లిం పర్సనల్ లా బోర్డు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే హక్కు ముస్లింలకు ఉందని మరో మతగురువు ఖాలిద్ రషీద్ ఫరంగీ అభిప్రాయపడ్డారు. కాగా, సుప్రీం తీర్పును పాట్నాకు చెందిన ఇమారత్ షరియా సంస్థ సభ్యుడు మౌలానా అనీస్ ఉర్ రెహమాన్ సమర్థించారు. ఈ తీర్పుతో షరియా కోర్టు పనికి భంగకరం కాబోదన్నారు.

మరిన్ని వార్తలు