స్వచ్ఛ భారత్‌ ప్రచారానికే 530 కోట్లు ఖర్చు

24 Nov, 2017 15:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కార్యక్రమానికి కేవలం ప్రచారం కల్పించడానికే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 530 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఈ స్కీమ్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి పత్రికలు, రేడియో, టీవీలకు ఇచ్చిన యాడ్స్‌కే ఈ 530 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు ఓ సామాజికి కార్యకర్త దాఖలు చేసిన సమాచార హక్కు దరఖాస్తు ద్వారా వెల్లడైంది. ఆ సామాజిక కార్యకర్త తన పేరును బహిర్గతం చేసేందుకు ఇష్టపడలేదు. ఈ మొత్తం 'బేటీ బచావో, బేటీ పాడావో' కార్యక్రమం ప్రచారానికి ఖర్చు పెట్టిన దానికంటే 15 రెట్లు ఎక్కువ. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014, అక్టోబర్‌ రెండవ తేదీన గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ స్వచ్ఛ భారత మిషన్‌కు శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే. 

స్వచ్ఛ భారత్‌ స్కీమ్‌ కింద 2019, అక్టోబర్‌ 2వ తేదీ నాటికి దేశంలో ప్రజలు బహిర్భూమికి వెళ్లే పరిస్థితిని పూర్తిగా నిర్మూలించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా దేశంలో 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించడం, ఇంటింటికి తిరిగి చెత్తా చెదారాన్ని నిర్మూలించి పరిసరాలను పరిశుభ్రంగా ఎలా ఉంచుకోవాలో నూటికి నూరు శాతం ప్రజలకు సరైన అవగాహన కల్పించడం, ప్రతి పట్టణంలో ఓ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఫ్లాంట్‌ను ఏర్పాటు చేయడం, చెత్తా చెదారాన్ని నిర్మూలించడంలో మున్సిపల్‌ సిబ్బందికి ఆధునిక పరికరాలను అందజేయడం, వాటిని వినియోగించడంలో శిక్షణ ఇవ్వడం తదితర చర్యలు తీసుకోవాల్సి ఉంది. 

ఈ స్కీమ్‌ను అమలు చేయడానికి గతేడాది బడ్జెట్‌ 9,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించగా, ఈ ఏడాది ఏకంగా 16,248 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. ఈ ఏడాదిలో అక్టోబర్‌ నెల వరకు ఈ స్కీమ్‌ను ప్రచారం చేయడానికి యాడ్స్‌ కోసం 37 కోట్ల రూపాయలను కేంద్రం ఖర్చు చేసింది. ఈ యాడ్స్‌ కోసం ఖర్చు పెడుతున్న నిధులకు సరైనా లెక్కా పత్రం ఉండడం లేదని కాగ్‌ గతేడాది అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసింది. ఇక స్కీమ్‌ను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సరైన సహకారం, సమన్వయం లోపించిందని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఈ స్కీమ్‌ను గ్రామ్య స్థాయికి తీసుకెళ్లడానికి ప్రభుత్వంతోని ఒప్పందం చేసుకున్న యునిసెఫ్‌ లాంటి సంస్థలు కృషి చేస్తున్నాయి.
 
ఇప్పటి వరకు స్వచ్ఛ భారత్‌లో కేంద్ర ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణంపైనే ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించిందని విమర్శకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 5.3 కోట్ల మరుగు దొడ్లను నిర్మించగా, పట్టణ ప్రాంతాల్లో 34 లక్షల మరుగుదొడ్లను నిర్మించారు. వాటిలో ఎక్కువ వరకు మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేవని, కొన్ని మరుగుదొడ్లను అప్పుడే ధ్వంసం చేశారని ఓ ఆంగ్ల మీడియా చేసిన పరిశోధనలో వెల్లడయింది. 2019 సంవత్సరం నాటికి ప్రభుత్వం మరో 8.2 కోట్ల మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకొంది. అంటే, నెలకు 23 లక్షలు, ప్రతి నిమిషానికి 56 మరుగు దొడ్లు నిర్మించాల్సి ఉంది. మరుగు దొడ్ల లక్ష్యాన్ని అందుకోవడంతోపాటు ప్రజల్లో బహిర్భూమికి వెళ్లే అలవాటును పూర్తిగా మాన్పించాలి. ఈ స్కీమ్‌ను చేపట్టిన ఈ మూడేళ్లలో దేశంలోని 2,72,235 గ్రామాలు లేదా 45 శాతం బహిర్భూమికి వెళ్లడాన్ని నిర్మూలించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

దేశంలో ఇంకా 73.20 కోట్ల మంది ప్రజలు అపరిశుభ్ర పరిసరాల్లో బహిర్భూమికి వెళుతున్నారని 'వాటర్‌ ఎయిడ్‌' అనే ప్రభుత్వేతర సంస్థ 'స్టేట్‌ ఆఫ్‌ ది వరల్డ్స్‌ టాయ్‌లెట్స్‌-17' నివేదికలో ఇటీవల వెల్లడించింది. మనుషులు పాకీ పనిచేయడం వల్ల ఒక్క 2016లోనే 1300 మంది మరణించారని 'సఫాయ్‌ కర్మచారి ఆందోళన్' గణాంకాలు తెలియజేస్తున్నాయి. మనుషులు పాకీపని చేయడాన్ని కేంద్రం ఎప్పుడో నిషేధించినప్పటికీ ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతోంది. 
 

మరిన్ని వార్తలు