Sakshi News home page

లైన్‌ ‘క్లియర్‌’ కొందరికే!

Published Mon, Oct 16 2023 5:02 AM

Telangana assembly elections: Congress releases first list  of 55 candidates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  కీలకమైన అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనను కాంగ్రెస్‌ పార్టీ వాయిదా వేసింది. మొత్తం 55 మందితో తొలి జాబితాను ప్రకటించినా.. కీలక నేతలు ఉన్న చాలా సీట్లను వదిలేసింది. తొలి జాబితాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, పొదెం వీరయ్య, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలతోపాటు గడ్డం వినోద్, కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, అంజన్‌కుమార్‌ యాదవ్, టి.రామ్మోహన్‌రెడ్డి, సంపత్‌కుమార్, దొంతి మాధవరెడ్డి వంటి వారికి చోటు దక్కింది.

ఎస్సీలకు రిజర్వ్‌ అయిన 12, ఎస్టీలకు రిజర్వ్‌ అయిన 2 స్థానాలు పోగా.. రెడ్డిలకు 17, వెలమలకు 7, బ్రాహ్మణులకు 2, మైనార్టీలకు 3, బీసీలకు 12 స్థానాలు దక్కాయి. అయితే బీసీల్లో ప్రధాన కులాలైన గౌడ, పద్మశాలి కులాల నేతల పేర్లు తొలిజాబితాలో కనిపించలేదు. యాదవ వర్గానికి 4, మున్నూరుకాపులకు 2, ముదిరాజ్, వాల్మికి, మేరు, వంజర, చాకలి, బొందిలి కు లాలకు ఒక్కొక్కటి దక్కాయి.

ఎస్సీల్లో మాదిగలకు 9, మాలలకు 3 స్థానాలు కేటాయించగా.. ఎస్టీల్లో 2 ఆదివాసీలకే ఇచ్చారు. లంబాడా నేతలకు తొలి జాబితాలో చోటు లభించలేదు. ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలిస్తే ఆదిలాబాద్‌ (3), నిజామాబాద్‌ (3), కరీంనగర్‌ (7), మెదక్‌ (5), రంగారెడ్డి (7), హైదరాబాద్‌ (10), మహబూబ్‌నగర్‌ (8), నల్లగొండ (6), వరంగల్‌ (4), ఖమ్మం (2) స్థానాలకు టికెట్లను ప్రకటించారు. 

ప్రముఖుల పేర్లు లేకుండానే! 
కాంగ్రెస్‌ తొలి జాబితాలో ఆ పార్టీ ప్రముఖులు కొందరి పేర్లు కనిపించలేదు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్, మాజీ ఎంపీలు సురేశ్‌ షె ట్కార్, బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్, పీఏసీ కన్వినర్‌ షబ్బీర్‌అలీ, క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ చిన్నారెడ్డి, వరంగల్‌ జిల్లాకు చెందిన కొండాసురేఖ, ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు వంటివారి పేర్లు తొలి జాబి తాలో లేకపోవడం గమనార్హం.

కచ్చితంగా తొలి జాబితాలో ఉంటాయని భావించిన కొందరి పేర్లు లేకపోవడం, అనూహ్యంగా మరికొందరి పేర్లు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ అను బంధ సంఘాలకు తొలి జాబితాలో ప్రాధాన్యం దక్కలేదు. టికెట్లు ఆశిస్తున్న యూత్‌ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, ఫిషర్‌మెన్, ఎస్సీసెల్, కిసాన్‌ కాంగ్రెస్, బీసీ సెల్‌ నేతలు ఆశిస్తున్న టికెట్లు ప్రకటించలేదు. మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావుకు గోషామహల్‌ స్థానం ఇచ్చారు. ఓయూ విద్యార్థి నేతలకూ తొలి జాబితాలో లభించలేదు. 

గెలుపు ఆశల్లేని స్థానాలే బీసీలకు? 
కాంగ్రెస్‌ తొలి జాబితాపై బీసీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. బీసీలకు మొత్తంగా 34 సీట్లు ఇస్తామని కాంగ్రెస్‌ ముఖ్యనేతలు చెప్పినా ఆ ప్రాధాన్యత కనిపించడం లేదని అంటున్నాయి. తొలి జాబితాలో 12 మంది బీసీల పేర్లు ఉన్నా.. సగం వరకు పెద్దగా గెలుపు ఆశలు లేనివేననే విమర్శలు వస్తున్నాయి. బీసీలకు ఇచ్చిన 12 సీట్లలో.. మేడ్చల్, గద్వాల, ముషీరాబాద్, ఆలేరు స్థానాలను యాదవ సామాజిక వర్గాలకు, సికింద్రాబాద్, వేములవాడ స్థానాలను మున్నూరుకాపులకు, గోషామహల్‌ను ముదిరాజ్‌ మహిళకు కేటాయించారు. రామగుండం (బొందిలి), షాద్‌నగర్‌ (రజక)లను ఎంబీసీ కులాలకు ఇచ్చారు. మిగతా మూడు సీట్లను ఎంఐఎం ప్రాబల్యం ఉండే పాతబస్తీలో కేటాయించారు. అందులో చాంద్రాయణగుట్ట (వాల్మికి), యాకుత్‌పుర (మేరు), బహుదూర్‌పుర (వంజర) ఉన్నాయి. 

పారాచూట్లకు చాన్స్‌ 
కాంగ్రెస్‌ తొలి జాబితాలో పారాచూట్‌ నేతలకు గణనీయంగానే సీట్లు దక్కాయి. కూచాడి శ్రీహరిరావు (నిర్మల్‌), వినయ్‌కుమార్‌రెడ్డి (ఆర్మూరు), సునీల్‌రెడ్డి (బాల్కొండ), మైనంపల్లి రోహిత్‌రావు (మెదక్‌), ఆగం చంద్రశేఖర్‌ (జహీరాబాద్‌), మైనంపల్లి హన్మంతరావు (మల్కాజ్‌గిరి), కోట నీలిమ (సనత్‌నగర్‌), సరితా తిరుపతయ్య (గద్వాల), కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి (నాగర్‌కర్నూల్‌), కసిరెడ్డి నారాయణరెడ్డి (కల్వకుర్తి), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్‌), వేముల వీరేశం (నకిరేకల్‌) ఇటీవల కాంగ్రెస్‌లో చేరినవారే. తొలి జాబితాలో ఆరుగురు మహిళలకు అవకాశం లభించింది. ఇందులో డాక్టర్‌ కోట నీలిమ, మొగిలి సునీత, సరితా తిరపతయ్య, సింగాపురం ఇందిర, సీతక్క, నలమాద పద్మావతి ఉన్నారు. మైనార్టీలకు నాంపల్లి, కార్వాన్, మలక్‌పేట స్థానాలను కేటాయించారు. 

గాందీభవన్‌ వద్ద నిరసన సెగలు 
తొలి జాబితా విడుదలతోనే కాంగ్రెస్‌లో నిరసనల సెగలు కూడా మొదలయ్యాయి. పలు చోట్ల టికెట్లు ఆశించిన నేతలు, వారి అనుచరులు గాందీభవన్‌ వద్ద ఆందోళనకు దిగారు. గద్వాల టికెట్‌ను అమ్ముకున్నారంటూ ఆ నియోజకవర్గ నేత కుర్వ విజయ్‌కుమార్‌ నేతృత్వంలో నిరసన తె లిపారు. మైనార్టీల ప్రాబల్యం ఉండే పాతబస్తీలో ఆ వర్గం నేతలకు కాకుండా ఇతరులకు టికెట్లు ఇచ్చారంటూ కొందరు మైనార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఉప్పల్, మేడ్చల్‌ వంటి చోట్ల కూడా టికె ట్లు రాని వారి అనుచరులు నిరసన వ్యక్తం చేశారు. కొందరు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీలను, దిష్టిబోమ్మలను దహనం చేశారు. 

Advertisement

What’s your opinion

Advertisement