స్వచ్ఛ్‌భారత్ స్ఫూర్తితో విద్యార్థిని ముందడుగు

6 Mar, 2016 00:47 IST|Sakshi
స్వచ్ఛ్‌భారత్ స్ఫూర్తితో విద్యార్థిని ముందడుగు

పట్టుబట్టి ఇంట్లో మరుగుదొడ్డి సాధించిన విద్యార్థిని
తుమకూరు(కర్ణాటక): స్వచ్ఛ్‌భారత్ స్పూర్తితో ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణాన్ని పట్టుబట్టి సాధించిందో విద్యార్థిని. కర్ణాటకలోని తుమకూరు జిల్లా హాలేనహళ్లిలో నివసించే దేవరాజు, భాగ్యమ్మల కూతురు లావణ్య. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆర్థికస్తోమత లేకపోవడంతో తండ్రి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించలేదు. పరిసరాల పరిశుభ్రతపై చైతన్యవంతురాలైన లావణ్య మరుగుదొడ్డి ఉండాల్సిందేనని గత కొద్ది నెలలుగా తల్లిదండ్రులతో వాదిస్తోంది. మూడు నెలల క్రితం ఉపవాస దీక్ష చేపట్టింది. దీంతో తల్లిదండ్రులు దిగిరాకతప్పలేదు. వెంటనే పంచాయతీ కార్యాలయానికి వెళ్లి స్వచ్ఛ్‌భారత్ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి దరఖాస్తుచేశారు.

నిధులు మంజూరవడంతో వెంటనే నిర్మాణం పూర్తిచేశారు. దీంతో లావణ్య విషయం ప్రసార మాధ్యమాల్లో మార్మోగింది. ఈ విషయం తెలుసుకున్న యూనిసెఫ్ బృందం సభ్యుడు కృష్ణ,  జెడ్పీ సీఈఓ డాక్టర్ మమత శనివారం గ్రామానికి వెళ్లి లావణ్యను అభినందించారు. పరిశుభ్రతపై అవగాహన కల్పించడానికి లావణ్యను రాయబారిగా నియమిస్తామని ప్రకటించారు. లావణ్యపై లఘుచిత్రం తీసి దేశమంతా ప్రసారం చేస్తామని కృష్ణ తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెను అవార్డుతో సత్కరించాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది.

మరిన్ని వార్తలు