ప్రపంచంలోని విశిష్ట కట్టడాల్లో తాజ్‌మహల్‌కు మూడో స్థానం

1 Jul, 2013 05:23 IST|Sakshi
ప్రపంచంలోని విశిష్ట కట్టడాల్లో తాజ్‌మహల్‌కు మూడో స్థానం

న్యూయార్క్: వాహ్ తాజ్.. మనమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులంతా ఇదే మాట అంటున్నారు. అనడమే కాదు.. ప్రపంచంలో విశిష్ట కట్టడాల జాబితాలో ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్‌కు 3వ స్థానాన్ని కట్టబెట్టేశారు కూడా. ట్రిప్ అడ్వైజర్ అనే ట్రావెల్ వెబ్‌సైట్ ప్రపంచంలోని టాప్ 25 విశిష్ట కట్టడాలను తెలుసుకునేందుకు ట్రిప్ అడ్వైజర్స్ 2013 ట్రావెలర్స్ చాయిస్ అవార్డు పేరుతో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో తాజ్‌మహల్‌కు మూడో స్థానం దక్కింది. మొదటి స్థానాన్ని పెరులోని ముచుపిచ్చు.. రెండో స్థానాన్ని కంబోడియాలోని ఆంగ్‌కోర్ ఆలయం దక్కించుకున్నాయి.

వివిధ పర్యాటక స్థలాలకు సంబంధించి పర్యాటకులు తమ ఆన్‌లైన్ రివ్యూల్లో వ్యక్తంచేసిన అభిప్రాయాల ఆధారంగా ఈ అవార్డులను ప్రకటించినట్టు ట్రిప్ అడ్వైజర్ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం మొఘల్ చక్రవర్తి షాజహాన్ తాజ్‌మహల్‌ను కట్టించిన విషయం తెలిసిందే. తాజ్‌ను అమరప్రేమకు చిహ్నంగా కూడా భావిస్తుంటారు. పూర్తిగా పాలరాతితో నిర్మించిన ఈ కట్టడం.. తన అద్భుత సౌందర్యంతో ఎన్నో దశాబ్దాలుగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. అందుకే 1983లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా తాజ్‌మహల్‌కు గుర్తింపు లభించింది. ఏటా 20 లక్షల నుంచి 40 లక్షల మంది పర్యాటకులు తాజ్‌ను సందర్శిస్తారని, వీరిలో విదేశీ టూరిస్టులు రెండు లక్షలకుపైనే ఉండొచ్చని అంచనా. తాజ్‌తో పాటు జోర్డాన్‌లోని పెట్రా.. కంబోడియాలోని బయోన్ ఆలయం.. అబుదాబీలోని షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు మొదలైనవి కూడా ట్రిప్ అడ్వైజర్ విశిష్ట కట్టడాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

>
మరిన్ని వార్తలు