రణరంగంగా తూత్తుకుడి

24 May, 2018 03:24 IST|Sakshi
బుధవారం తూత్తుకుడిలో ఆందోళనకారులు నిప్పంటించిన బస్సు

13కు పెరిగిన మృతుల సంఖ్య

రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో విచారణ

సాక్షి ప్రతినిధి, చెన్నై: వేదాంత కంపెనీ స్టెరిలైట్‌ కాపర్‌ యూనిట్‌కు వ్యతిరేకంగా తూత్తుకుడిలో వరుసగా రెండో రోజు ఆందోళనలు కొనసాగాయి. బుధవారం పోలీసులు జరిపిన కాల్పులకు 22 ఏళ్ల యువకుడు బలయ్యాడు. మంగళవారం నాటి కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి కూడా మృతిచెందాడు. దీంతో రెండ్రోజుల వ్యవధిలో ఇక్కడ మృతిచెందిన వారి సంఖ్య 13కు పెరిగింది. ఆందోళనకారులు అన్నానగర్‌లో బుధవారం కూడా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.

పోలీసులపైకి రాళ్లు, ఇటుకలు రువ్వడంతో వారు కాల్పులు జరిపారు. తూత్తుకుడి హింసాత్మక ఘటనలపై విచారణ జరిపేందుకు తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ అరుణా జగదీశన్‌ నేతృత్వంలో కమిటీని నియమించింది. మరోవైపు, స్టెరిలైట్‌ కాపర్‌ యూనిట్‌ విస్తరణ పనులను నిలిపేయాలని మద్రాస్‌ హైకోర్టు ఆదేశించింది.  ఆందోళనల్లో 13 మంది మృతిచెందడంపై తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపికి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ నోటీసులు పంపింది. రెం డు వారాల్లో నివేదికలు సమర్పించాలని కోరింది.

మరిన్ని వార్తలు