‘నేను కృష్ణున్ని.. తను అర్జునుడు’

17 Dec, 2018 16:29 IST|Sakshi

పట్నా : ఆయన తిరిగొచ్చాడు.. వార్తల్లోకి, వ్యాపారంలోకి. ఇంతకు ఎవరాయన అంటే.. ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు, బిహార్‌ మాజీ మంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌. కొన్ని రోజుల క్రితం విడాకులు కావాలంటూ వార్తల్లోకెక్కిన తేజ్‌ ప్రతాప్‌.. ఇళ్లు వదిలి ఆలయ సందర్శన ప్రారంభించిన సంగతి తెలిసిందే. తీర్ధయాత్రలు ముగించుకుని ఇంటికి చేరుకున్న తేజ్‌ ప్రతాప్‌ ఇక మీదట పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిడానికి సిద్ధమయినట్లు సమాచారం.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తేజ్‌ ప్రతాప్‌ మాట్లాడుతూ.. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడం చాలా సంతోషం కల్గించిందని తెలిపారు. ఈ గెలుపులో రాహుల్‌ గాంధీ కీలక పాత్ర పోషించారన్నారు. బీజేపీ - ఆర్‌ఎస్‌ఎస్‌ కూటమే బిహార్‌లో తన ప్రథమ ప్రత్యర్థిగా చెప్పుకొ​చ్చారు. అంతేకాక ఈ తీర్థయాత్ర సమయంలో తాను కృష్ణ భగవానుని ఆశీర్వాదాలు పొంది బిహార్‌ తిరిగి వచ్చానని తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో తన శత్రువులైన బీజేపీ - ఆర్‌ఎస్‌ఎస్‌ కూటమిని తన సుదర్శన చక్రంతో వధిస్తానని శపథం చేశారు.

అయితే విలేకరులు ఐశ్వర్యతో విడాకుల విషయం గురించి ప్రస్తావించగా.. తేజ్‌ ప్రతాప్‌ జవాబు చెప్పకుండా మౌనంగా ఉన్నారు. అనంతరం సోదరుడు తేజస్వితో గల విబేధాల గురించి ప్రశ్నించగా.. తేజస్వి అర్జునుడు.. నేను కృష్ణున్ని అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక మహాభారతంలో కృష్ణుడు పోషించిన పాత్రనే తాను ఇప్పుడు బిహార్‌ రాజకీయాల్లో పోషించబోతున్నట్లు తెలిపాడు.

మరిన్ని వార్తలు