'ఆ దేశాలకు ఇప్పుడు తెలిసొచ్చింది'

22 Nov, 2015 21:25 IST|Sakshi
'ఆ దేశాలకు ఇప్పుడు తెలిసొచ్చింది'

భోపాల్: చర్చల ద్వారా భద్రతా బలగాల ద్వారా ఉగ్రవాద సమస్యను పరిష్కరించడం సాధ్యంకాదని ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. ఈ చర్యలకు బదులుగా ప్రతి ఒక్కరికి ఈ భూమిపై జీవించే హక్కు ఉందని ఉగ్రవాదులు అర్థం చేసుకునేలా చేయడం ద్వారా సమస్య తీవ్రతను తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. 'ఉగ్రవాదులను తప్పకుండా చర్చలకు ఆహ్వానించాలి. అయితే, ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉందని వారు అర్థం చేసుకోనంతవరకు ఇలాంటి పని వ్యర్థమవుతుంది. అందుకే వారిని నియంత్రించేందుకు భద్రతా బలగాలను ఉపయోగించాల్సి వస్తుంది. ఇది మాత్రం శాశ్వత పరిష్కారం కాదు' అని రవిశంకర్ అన్నారు.

కుంచిత మనస్తత్వం వల్లే ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని చెప్పారు. అన్ని మతాలమీద చిన్నతనం నుంచే అవగాహన కల్పించినా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అనుకోవడం లేదని చెప్పారు. చాలా కాలం నుంచి భారత్ ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటుందని తొలుత చెప్పినప్పుడు ఏ ఒక్క పాశ్చాత్య దేశం ఆమోదించలేదని, పైగా దాడులకు ప్రతి దాడులు ఉంటాయే తప్ప ఎవరూ కావాలని దాడులు చేయరని వ్యాఖ్యానించాయని, ఇప్పుడు తాజాగా పారిస్ దాడులతో ఆ దేశాలకు అసలు విషయం బోధపడిందని అన్నారు.

భారత్ సమస్య ఇప్పుడు ప్రపంచ దేశాలకు తెలిసివచ్చిందని, పారిస్ ఘటనతో యూరప్ దేశాలన్నీ ఒక తాటిపైకి వచ్చి భారత్ ముందు నుంచి చేస్తున్న హెచ్చరికలను నేటికి అర్థం చేసుకున్నాయని అన్నారు. ఇక, దేశంలో అసహన పరిస్థితులు ఉన్నట్లు తనకు ఎక్కడా కనిపించలేదని అన్నారు. ఇలాంటి పుకార్లన్నీ ఎన్నికల సమయంలోనే షికార్లు చేస్తాయని చెప్పారు.

మరిన్ని వార్తలు