కశ్మీర్‌లో అలజడికి ఉగ్రవాదుల కొత్త వ్యూహం!

16 Oct, 2019 17:07 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ : ఆర్టికల్‌ 370 రద్దుతో కశ్మీర్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఉగ్రవాదులు దేశంలోకి చొరబడకుండా నిఘాను పటిష్టం చేసింది. దీంతో ఉక్కిరిబిక్కిరికి గురవుతోన్న పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎలాగైనా కశ్మీర్‌లో అశాంతిని రేపాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు సాధారణ పౌరులను టార్గెట్‌ చేస్తున్నారు. దీనికి ఉదాహరణగా సోమవారం షోపియాన్‌ జిల్లాలో రాజస్థాన్‌కు చెందిన ట్రక్‌ డ్రైవర్‌ను కాల్చి చంపడాన్ని చెప్పుకోవచ్చు. ఈ దాడిలో ఇద్దరు పాల్గొన్నారని, అందులో ఒకరు పాకిస్థాన్‌ జాతీయుడని నిఘావర్గాలు గట్టిగా అనుమానిస్తున్నాయి. తాజాగా పుల్వామా జిల్లాలోని కాక్పురా ప్రాంతంలో ఓ సాధారణ వ్యక్తిని ఉగ్రవాదులు బుధవారం కాల్చిచంపారు. ఈ విషయం తెలిసి రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి.

అయితే సాధారణ పౌరులే లక్ష్యంగా వరుస సంఘటనలు చోటుచేసుకోవడం వెనుక కశ్మీర్‌లో ప్రశాంత పరిస్థితులను భంగపరిచే ఉద్దేశ్యం ఉన్నట్టు భద్రతా నిపుణులు అంచనా వేస్తున్నారు. 370 రద్దు తర్వాత కశ్మీరీలను ఎంత రెచ్చగొట్టినా ఎలాంటి ప్రతిస్పందనా లేకపోవడంతో వారు ఈ వ్యూహానికి తెరలేపారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్‌ విషయంలో అంతర్జాతీయ వేదికల మీద పాకిస్థాన్‌ తేలిపోతుండడంతో సామాన్య పౌరులను హతమార్చడం ద్వారా వారిలో అభద్రత, భయాందోళనలు రేపి తద్వారా కశ్మీర్‌లో పరిస్థితులు క్షీణించాయని ప్రపంచ దేశాలకు చూపే ప్రయత్నం కూడా అయి ఉండవచ్చని వారు భావిస్తున్నారు.    

మరిన్ని వార్తలు