కశ్మీరాన వీడని చిక్కుముడి

26 Dec, 2014 00:56 IST|Sakshi
కశ్మీరాన వీడని చిక్కుముడి
  • ప్రభుత్వ ఏర్పాటుపై తొలగని ప్రతిష్టంభన
  • బీజేపీతో పొత్తును దాదాపు తోసిపుచ్చిన ఎన్‌సీ
  • పీడీపీతో ఎన్‌సీ జట్టు?; అదే బాటలో కాంగ్రెస్
  • శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. హంగ్ ఫలితాల నేపథ్యంలో సంకీర్ణ సర్కారు అనివార్యమైనా ఎవరెవరు జతకడతారన్న చిక్కుముడి వీడటంలేదు. 25 సీట్లతో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రధాన పార్టీలవైపు చూస్తుండగా ఆయా పార్టీల నుంచి గురువారం కూడా అటువంటి సంకేతాలేవీ అందలేదు. సర్కారు ఏర్పాటుపై ఎన్‌సీ, బీజేపీ నాయకత్వాల మధ్య సంప్రదింపులు జరిగినా ముందడుగు పడలేదని తెలియవచ్చింది.

    రాష్ట్ర మాజీ సీఎం, ఎన్‌సీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా బుధవారం రాత్రి ఢిల్లీలో బీజేపీ చీఫ్ అమిత్ షాను కలిసినట్లు వార్తలు వచ్చినా ఇరు పార్టీలు వాటిని ఖండించాయి. ఈ పరిస్థితుల్లో కమల దళానికి మద్దతును ఎన్‌సీ దాదాపు తోసిపుచ్చినట్లేనని తెలుస్తోంది. బీజేపీతో పొత్తుకు తాము సుముఖంగా లేమని, ఇదే విషయాన్ని పార్టీ నాయకత్వానికి తెలియజేశామని ఎన్‌సీ ఎమ్మెల్యే ఆగా సయ్యద్ రుహుల్లా గురువారం పేర్కొన్నారు.

    మరోవైపు ఒమర్ ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ పీడీపీకి తాము చేసిన మద్దతు ప్రతిపాదనపై స్పందించాల్సినది ఆ పార్టీయేనని వ్యాఖ్యానించారు. కాగా, కాంగ్రెస్ సైతం పీడీపీకి దగ్గరయ్యేందుకు గాలం వేస్తోంది. భావసారూప్యతగల పార్టీలతో కలసి సంకీర్ణ సర్కారుకు సారథ్యం వహించాలంటూ రాష్ట్ర పీసీసీ చీఫ్ సైఫుద్దీన్ సౌజ్ గురువారం పీడీపీ చీఫ్ ముఫ్తీ మొహమ్మద్ సయీద్‌ను కోరారు.

    పీడీపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడితేనే ప్రజాతీర్పును గౌరవించినట్లు అవుతుందన్నారు. బీజేపీని ప్రభుత్వ ఏర్పాటు నుంచి దూరం పెట్టేందుకు కాంగ్రెస్, ఎన్‌సీలతో కలసి సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేసేందుకు పీడీపీకి సంఖ్యాబలం సరిపోతుందని మరో కాంగ్రెస్ నేత గులామ్ నబీ ఆజాద్ పేర్కొన్నారు.
     
    ప్రభుత్వ ఏర్పాటులో మేమే కీలకం: జైట్లీ
     
    జమ్మూకశ్మీర్‌లో ఏర్పడబోయే ప్రభుత్వంలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. పార్టీ నూతన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యేందుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో కలసి గురువారం జమ్మూ విచ్చేసిన జైట్లీ... ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అవకాశాల గురించి ఆరా తీశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో పీడీపీకి ఎక్కువ సీట్లు (28) వచ్చినా అత్యధిక ఓట్ల శాతం (23%) మాత్రం తమకే వచ్చిందన్నారు. అందువల్ల ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణయాత్మక శక్తి తామేనని, ‘వీటో’ అధికారం ప్రస్తుతం తమ చేతిలోనే ఉందన్నారు.
     

మరిన్ని వార్తలు