సిట్టింగ్‌ జడ్జిపై ఎఫ్‌ఐఆర్‌ వద్దు: సుప్రీం

15 Nov, 2017 01:26 IST|Sakshi

‘జడ్జీల పేరుతో లంచాల’ విచారణపై సిట్‌ ఏర్పాటుకు తిరస్కరణ

న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థ స్వతంత్రత సీబీఐ లేదా పోలీసుల దయా దాక్షిణ్యాలపై ఆధారపడి ఉండబోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీం లేదా హైకోర్టు సిట్టింగ్‌ జడ్జీలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయొద్దని పునరుద్ఘాటించింది. జడ్జీల పేరుతో లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలపై సిట్‌తో దర్యాప్తు చేయించాలన్న పిటిషన్‌ను మంగళవారం జస్టిస్‌ ఆర్‌కే అగర్వాల్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది.

ఈ సందర్భంగా ధర్మాసనం... ఉన్నత న్యాయ వ్యవస్థలోని సిట్టింగ్‌ జడ్జీలకు వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్‌ దాఖలుచేయకూడదన్న 1991 నాటి తీర్పును గుర్తుచేసింది. ఓ మెడికల్‌ కాలేజీకి అనుకూలంగా వ్యవహరించేందుకు అవినీతి జరిగిందన్న ఆరోపణపై సీబీఐ దాఖలుచేసిన ఎఫ్‌ఐఆర్‌ ఏ సుప్రీంకోర్టు జడ్జి పేరు సూచించేలా లేదంది. ‘ఎవరైనా జడ్జిపై నమోదైన కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందన్న  ప్రచారం జరిగితే, అది సదరు జడ్జి, కేసు వేసిన వ్యక్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

అలాగే, సిట్‌ ఏర్పాటు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపే బెంచ్‌ నుంచి ప్రధాన న్యాయమూర్తిని తప్పించడానికి పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశాన్ని తెరమీదకు తేవడం సరికాదు’ అని బెంచ్‌ తేల్చిచెప్పింది. కొం దరు సీనియర్‌ లాయర్లు ఒకే అంశంపై వేర్వే రు కేసులు వేసి వాటిని పలానా బెంచే విచా రించాలని పట్టుబట్టడాన్నీ తప్పుపట్టింది.

మరిన్ని వార్తలు