మంచి కబురు చెప్పిన మంత్రి గజపతిరాజు

3 May, 2016 13:19 IST|Sakshi
మంచి కబురు చెప్పిన మంత్రి గజపతిరాజు

న్యూఢిల్లీ: 'కర్ణుడి చావుకు వంద కారణాలు' అన్నట్టు.. ప్రభుత్వ సేవా సంస్థల నష్టాలకు కారణాలు కోకొల్లలు. ఇక విమానయాన సంస్థల మాట ఎత్తితే నష్టాలు తప్ప మరొకటి వినిపించదు. ఏళ్లుగా కొనసాగుతున్న ఈ పరిస్థితి ఇటీవలే కాస్త మెరుగు పడింది. ఈ మేరకు ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా విషయంలో మంచి కబురు చెప్పారు పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు.

మంగళవారం రాజ్యసభలో ఎయిర్ క్యారేజ్ (సవరణ) బిల్లుపై మాట్లాడిన మంత్రి గజపతిరాజు.. ఎయిర్ ఇండియా నిర్వహణా లాభాన్ని ఆర్జించిందని తెలిపారు. 'ఈ ఏడాది ఎయిర్ ఇండియా నిర్వహణా నష్టాలను చవిచూడకపోగా లాభాన్ని సాధించింది' అని ప్రకటించారు. మంత్రి ప్రకటనను పలువురు సభ్యులు బల్లలుచరిచి ఆహ్వానించారు.

గత ఏడాది నుంచి విమాన ఇంధనం ధరలు తగ్గడం విమానయాన సంస్థలకు కొత్త ఊపిరినిచ్చినట్టయింది. ఖర్చులు తగ్గడంతో 2015-15 ఆర్థిక సంవత్సరంలో పలు దేశీయ విమానయాన సంస్థలు లాభాలను ప్రకటించాయి కూడా. అయితే విదేశాలకు సర్వీసులు నడుపుతోన్న ఎయిర్‌ ఇండియా లాంటి సంస్థలకు మాత్రం నష్టాలు తప్పలేదు. గతేడాది ఎయిర్ ఇండియా 90-92 కోట్ల డాలర్ల నష్టాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో నష్టాలను అధిగమించినట్లు మంత్రి ప్రకటించడం శుభసూచికం.

>
మరిన్ని వార్తలు