మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాది హతం

18 Oct, 2018 03:09 IST|Sakshi
ఎన్‌కౌంటర్‌ జరిగిన చోట భద్రతాబలగాలు

కశ్మీర్‌లో ముగ్గురిని కాల్చిచంపిన భద్రతాదళాలు  

శ్రీనగర్‌: కశ్మీర్‌లో లష్కరేతోయిబా కార్యకలాపాలకు సూత్రధారిగా ఉన్న మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాది మెహ్రాజుద్దీన్‌ బంగ్రూ సహా ముగ్గురిని భద్రతాబలగాలు బుధవారం మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల కదలికలపై పక్కా సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్, పోలీసుల సంయుక్త బృందం బుధవారం తెల్లవారుజామున శ్రీనగర్‌లోని ఫతేహ్‌కదల్‌ ప్రాంతంలో ఉగ్రమూకలు నక్కిన ఇంటిని చుట్టుముట్టింది. అనంతరం ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించగా ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ సందర్భంగా ఉగ్రమూకల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్‌ కమల్‌ కిశోర్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇక ఎన్‌కౌంటర్‌లో మెహ్రాజుద్దీన్‌ బంగ్రూతో పాటు ఫహద్‌ వజా, రయీస్‌ అబ్దుల్లాలను బలగాలు మట్టుబెట్టాయి. ఈ విషయమై కశ్మీర్‌ పోలీస్‌శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌(ఐజీ) స్వయం ప్రకాశ్‌ పానీ మాట్లాడుతూ.. శ్రీనగర్‌లో జరిగిన పలు ఉగ్రదాడులు, ఆయుధాల దొంగతనం, బ్యాంకుల లూటీతో పాటు లష్కరేకు దాడులకు బంగ్రూ కీలక సూత్రధారిగా వ్యవహరించాడని తెలిపారు.

మరిన్ని వార్తలు