బ్రస్సెల్స్ దాడి భయంతో బూట్లు, బెల్టులు విప్పించి..

25 Mar, 2016 15:18 IST|Sakshi
బ్రస్సెల్స్ దాడి భయంతో బూట్లు, బెల్టులు విప్పించి..

న్యూఢిల్లీ: అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో సాధారణ విమాన ప్రయాణికులతో పాటు వీఐపీలను సైతం క్షుణ్నంగా తనిఖీ చేస్తుంటారు. వీఐపీలకు దుస్తులు విప్పించి తనిఖీలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనిపై వీఐపీలు ఆగ్రహం వ్యక్తం చేయడం, వివాదాస్పదమైన ఘటనలు కూడా ఉన్నాయి. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ విమానాశ్రయంలో ఉగ్రవాదదాడి నేపథ్యంలో భారత్లోని ప్రధాన విమానాశ్రయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు గతంలో కంటే తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రయాణికుల బూట్లు, బెల్టులు విప్పించి క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు.

ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, చెన్నై, అహ్మదాబాద్ వంటి ప్రధాన విమానాశ్రయాల్లో భద్రతను పెంచారు. ప్రయాణికులు విమానంలోకి ప్రవేశించే ముందు పలు దశల్లో సీఐఎస్ఎఫ్, స్థానిక పోలీసులు వారిని క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచిఉందున్న కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు భారీ భద్రత చర్యలు తీసుకున్నట్టు ఓ అధికారి చెప్పారు. బ్రస్సెల్స్ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడుల్లో రెండు పేలుళ్లు సంభవించగా, పేలని బెల్టు బాంబును భద్రత బలగాలు గుర్తించి నిర్వీర్యం చేశాయి. ఈ నేపథ్యంలో భారత్లో ప్రయాణికుల కదలికలపై నిఘా పెంచడంతో పాటు తనిఖీలను ముమ్మరం చేశారు.
 

మరిన్ని వార్తలు