నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక

5 Aug, 2017 03:48 IST|Sakshi
నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక

► సాయంత్రానికి ఫలితం వెల్లడి 
► ఎన్‌డీఏ అభ్యర్థి వెంకయ్యకే విజయావకాశాలు


న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమయ్యింది. శనివారం(నేడు) పార్లమెంట్‌ సభ్యులు ఉప రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే విషయం శనివారం సాయంత్రానికి తేలిపోనుంది. లోక్‌సభలో మెజారిటీగల ఎన్‌డీఏ అభ్యర్థి  వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికకవడం లాంఛనమే. ఆయనపై విపక్షాలు మహాత్మాగాంధీ మనవడు, పశ్చిమబెంగాల్‌ మాజీ గవర్నర్‌ గోపాలకృష్ణ గాంధీని రంగంలోకి దించాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతు తెలిపిన బీజేడీ, జేడీయూ ఇప్పుడు గాంధీకి మద్దతిస్తున్నాయి.

సాయంత్రానికి ఫలితం: పార్లమెంట్‌ హౌస్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఓటింగ్‌ జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకు ఫలితం వెల్లడిస్తారు. రహస్య ఓటింగ్‌ పద్ధతిలో ఈ ఎన్నిక జరుగుతున్నందున పార్టీలు విప్‌ జారీ చేయలేదు. రెండుసార్లు ఉపరాష్ట్రపతిగా కొనసాగిన హమీద్‌ అన్సారీ పదవీకాలం ఈ నెల 10తో ముగియనుంది రాజ్యసభ ఎక్స్‌–అఫీషియో చైర్మన్, లోక్‌సభ, రాజ్యసభలకు ఎన్నికైన, నామినేట్‌ అయిన సభ్యులతో కూడిన ఎలక్టోరల్‌ కాలేజ్‌ ఉపరాష్ట్రపతిని ఎన్నుకోనుంది. ఉభయ సభల్లో మొత్తం సభ్యుల సంఖ్య 790. అయితే లోక్‌సభలో రెండు, రాజ్యసభలో ఒక స్థానం ఖాళీగా ఉన్నాయి.

అలాగే కోర్టు తీర్పు కారణంగా లోక్‌సభలో బీజేపీ ఎంపీ చేడీ పాశ్వన్‌ ఓటు హక్కును వినియోగించుకోలేరు. 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి ఎన్నికలో గెలుస్తారు. లోక్‌సభలో మొత్తం సభ్యులు 545. బీజేపీ సభ్యులు 281. బీజేపీతో కలిపి ఎన్‌డీఏ బలం 338. ఇక 243 మంది సభ్యులున్న రాజ్యసభలో బీజేపీకి 58 మంది సభ్యులు.. కాంగ్రెస్‌కు 57 మంది సభ్యులు ఉన్నారు. కాగా, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఒకే కుటుంబం(బీజేపీ) నుంచి వస్తుండటంతో 2017–2022 మధ్య ఉజ్వల భవిత దిశగా దేశం పయనిస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యకు మద్దతిస్తున్న వివిధ పార్టీల ఎంపీలతో నిర్వహించిన భేటీలో ఆయన మాట్లాడారు.

మరిన్ని వార్తలు