ఎవరి పంతం వారిది! 

30 Oct, 2019 00:41 IST|Sakshi

మహారాష్ట్రలో వీడని ఉత్కంఠ

50:50 కుదరలేదన్న ఫడ్నవిస్‌

బీజేపీతో ఉద్ధవ్‌ భేటీ రద్దు

సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర సీఎం పదవి కోసం బీజేపీ,శివసేన మధ్య ఏర్పడిన పీటముడి బిగుస్తోంది. ఎన్నికలకు ముందు పొత్తు ఏర్పాటైనప్పుడు బీజేపీ హామీ ఇచ్చినట్టుగా రొటేషన్‌ పద్ధతిలో సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే పట్టుబడుతున్నారు. దీనిపై తొలిసారి నోరు విప్పిన దేవేంద్ర ఫడ్నవీస్‌ మాత్రం పార్టీల మధ్య అలాంటి ఒప్పందమేమీ జరగలేదని కుండబద్దలు కొట్టినట్టు వెల్లడించారు. మరో అయిదేళ్లు బీజేపీ నేతృత్వంలో కూటమి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.

బుధవారం కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకుంటారని వెల్లడించారు. ఫడ్నవీస్‌ వ్యాఖ్యలతో ఉద్ధవ్‌ ఠాక్రే బీజేపీతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అమిత్‌ షా మంగళవారం ముంబైకి రానున్నారని దీంతో ముఖ్యమంత్రి పీఠంపై చిక్కు ముడి వీడనుందని భావించారు. అయితే అమిత్‌ షా పర్యటన రద్దు కావడంతో ఈ విషయంపై ఉత్కంఠ పెరిగింది. 50:50 ఫార్ములా అంశాల గురించి అమిత్‌షా.. ఉద్ధవ్‌ ఠాక్రేతో మాట్లాడి ఖరారు చేస్తారని బీజేపీ సీనియర్‌ నేత చంద్రకాంత్‌ పాటిల్‌ వెల్లడించారు.

మహారాష్ట్రలో దుష్యంత్‌ లేడు: శివసేన విసుర్లు  
శివసేన తమకు అధికార దాహం లేదని, చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని కోరుతున్నామనే చెబుతోంది. రాజకీయాల్లో తాము ఎప్పుడూ నిజాయితీగా వ్యవహరిస్తామని ఆ పార్టీ నాయకుడు సంజయ్‌ రౌత్‌ అన్నారు. తమ ముందు ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ ఎన్నికలకు ముందు జరిగిన ఒప్పందానికి కట్టుబడి బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకే తమ అధినేత ఉద్ధవ్‌ మొగ్గు చూపిస్తున్నారని  అన్నారు. హరియాణాలో దుష్యంత్‌ తండ్రి జైల్లో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. మహారాష్ట్రలో దుష్యంత్‌లెవరూ లేరని, అందుకే ప్రభుత్వం ఏర్పాటుకు ఆలస్యమవుతోందని సంజయ్‌ రౌత్‌ బీజేపీపై చెణుకులు విసిరారు.

బీజేపీ ముందున్న మార్గాలేంటి! 
బీజేపీ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 40 సీట్లు కావాలి. శివసేన రొటేషన్‌ పద్ధతిలో సీఎం డిమాండ్‌ను విడిచిపెట్టకపోతే బీజేపీ ఎన్సీపీతో చేతులు కలిపినా ఆశ్చర్యపడనక్కర్లేదని విశ్లేషకుల అంచనా. శివసేనకు మద్దతునివ్వబోమని ఇప్పటికే శరద్‌పవార్‌ పార్టీ ఎన్సీపీ తేల్చి చెప్పేసింది. ఈసారి ఎన్నికల్లో 54 సీట్లతో ఎన్సీపీ బలమైన శక్తిగానే అవతరించింది. ఈ రెండు పార్టీలు చేతులు కలిపితే వారి బలం 159కి చేరుకుంటుంది. అందులోనూ పవార్‌ చుట్టూ ఈడీ ఉచ్చు బిగుస్తూ ఉండడంతో ఎన్సీపీ రాజీపడే అవకాశాలున్నాయనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈసారి ఎన్నికల్లో 17 మంది బీజేపీ రెబెల్‌ అభ్యర్థులు గెలిచారు. వారందరినీ తమ వైపు తిప్పుకొని బలం పెంచుకోవడం ద్వారా శివసేనను బలహీనపరిచి తామే అయిదేళ్లు పాలించే వ్యూహాన్ని కూడా బీజేపీ పరిశీలిస్తోంది.

105 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ రెబెల్‌ అభ్యర్థుల్ని తమ వైపు తిప్పుకుంటే 125కి బలం చేకూరుతుంది. మరోవైపు శివసేన కూడా స్వతంత్ర అభ్యర్థులపై వల వేస్తూ తన పవర్‌ చూపిస్తోంది. శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే నాన్చుడు ధోరణి ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తిని పెంచుతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీపై పోరాటం చేసిన తమకు అధికారాన్ని పంచుకునే అవకాశం వచ్చినప్పుడు దానిని జారవిడుచుకోకూడదని వారు భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు సంకేతాలు పంపుతున్నాయి. 45 మంది శివసేన ఎమ్మెల్యేలు బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు మొగ్గు చూపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా