సయీద్‌కు ఐరాస షాక్‌

8 Mar, 2019 04:51 IST|Sakshi

నిషేధం ఎత్తివేతకు ఐరాస నో

న్యూఢిల్లీ: ముంబై మారణహోమం సూత్రధారి, జమాత్‌ ఉద్‌ దవా(జేయూడీ) అధినేత హఫీజ్‌ సయీద్‌కు ఐక్యరాజ్యసమితి(ఐరాస) షాక్‌ ఇచ్చింది. నిషేధిత ఉగ్రవాదుల జాబితా నుంచి సయీద్‌ పేరును తొలగించేందుకు ఐరాస నిరాకరించింది. ఈ సందర్భంగా సయీద్‌పై నిషేధం ఎత్తివేతను భారత్, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌ వ్యతిరేకించగా, పాక్‌ మౌనంగా ఉండిపోయింది. కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘సయీద్‌కు వ్యతిరేకంగా భారత్‌ బలమైన సాక్ష్యాలను సమర్పించింది. అతని ఉగ్రవాద కార్యకలాపాలపై పూర్తిస్థాయి ఆధారాలను ఐరాసకు అందజేసింది. దీంతో సయీద్‌పై నిషేధాన్ని కొనసాగిస్తామని ఐక్యరాజ్యసమితి ఆయన న్యాయవాది హైదర్‌ రసూల్‌ మిర్జాకు తెలియజేసింది’ అని వెల్లడించారు.

లష్కరే తోయిబా సహ–వ్యవస్థాపకుడైన సయీద్‌ ప్రస్తుతం పాకిస్తాన్‌లో గృహనిర్బంధంలో కొనసాగుతున్నాడని పేర్కొన్నారు. జేయూడీపై ఐరాస 2008లో నిషేధం విధించిందన్నారు. ఈ కేసులో స్వతంత్ర అంబుడ్స్‌మెన్‌గా వ్యవహరిస్తున్న డానియెల్‌ కిఫ్సెర్‌ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడం ఆలస్యమయిందని తెలిపారు. సయీద్‌పై నిషేధానికి ఐరాస 1267 ఆంక్షల కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. ఐరాస ఆంక్షల కమిటీ ప్రధానంగా ఆస్తుల జప్తు, ప్రయాణ నిషేధం, ఆయుధాల అమ్మకం నిలిపివేత అనే మూడు అంశాలను పర్యవేక్షిస్తుంది. ఆంక్షల కమిటీ నిబంధనల మేరకు నిషేధిత జాబితాలోని సంస్థలు లేదా వ్యక్తుల ఆస్తులను సభ్యదేశాలు తక్షణం జప్తుచేయాలి. వీరికి ప్రభుత్వాలు ఎలాంటి సహాయసహకారాలు అందించరాదు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా