-

అధ్యాపక రిజర్వేషన్లలో పాత పద్ధతి

8 Mar, 2019 04:44 IST|Sakshi

200–పాయింట్‌ రోస్టర్‌ విధానానికి కేబినెట్‌ ఓకే

న్యూఢిల్లీ: ఉన్నత విద్యా సంస్థల్లో అధ్యాపక నియామకాల్లో 200–పాయింట్‌ రోస్టర్‌ ఆధారిత రిజర్వేషన్‌ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టడం కోసం ఆర్డినెన్స్‌ తీసుకురావాలన్న ప్రతిపాదనను కేంద్రకేబినెట్‌ ఆమోదించింది. ఈ విషయంలో 2017లో అలహాబాద్‌ హైకోర్టు, సుప్రీంకోర్టు∙తీర్పుల నుంచి మినహాయింపు పొంది, రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి చేకూర్చేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు, ఉపాధ్యాయుల నియామకాల్లో ఒక్కో విభాగాన్ని లేదా ఒక్కో సబ్జెక్ట్‌ను ఒక యూనిట్‌గా పరిగణించాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) గతేడాది మార్చిలో స్పష్టం చేసింది. 2017 ఏప్రిల్‌లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పును అనుసరించి యూజీసీ ఈ ఆదేశాలిచ్చింది.

విశ్వవిద్యాలయం మొత్తాన్ని కాకుండా అందులోని ఒక్కో విభాగాన్ని ఒక్కో యూనిట్‌గా పరిగణించడం వల్ల ఒకటి లేదా రెండు ఉద్యోగ ఖాళీలే ఉన్న చోట రిజర్వేషన్‌ వర్తించేది కాదు. ఆ ఉద్యోగాలను జనరల్‌ కేటగిరీ కింద భర్తీ చేయాల్సి వచ్చేది. అదే విశ్వవిద్యాలయం మొత్తాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తే, అన్ని విభాగాల్లో కలిపి ఖాళీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు దక్కుతాయి. దీంతో అలహాబాద్‌ హైకోర్టు తీర్పును సవరించాలనీ, యూజీసీ ఆదేశాలను రద్దు చేయాలంటూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే కేంద్రం పిటిషన్‌ను సుప్రీంకోర్టు గత నెలలో కొట్టేసింది. దీంతో 200–పాయింట్‌ రోస్టర్‌ ఆధారిత పాత రిజర్వేషన్‌ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టడం కోసం కేంద్రం ఆర్డినెన్స్‌ తీసుకొస్తుందని హెచ్‌ఆర్‌డీ మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ గత నెలలో లోక్‌సభలో ప్రకటించారు.

అధ్యాపక నియామకాలు ప్రారంభించండి
కేబినెట్‌ నిర్ణయం నేపథ్యంలో అధ్యాపక నియామక ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) దేశంలోని విశ్వవిద్యాలయాలను కోరింది. ఈ మేరకు యూజీసీ వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్లకు సూచించింది.

మరిన్ని వార్తలు