ఇది పూర్తిగా గ్రామీణ బడ్జెట్

29 Feb, 2016 18:22 IST|Sakshi
ఇది పూర్తిగా గ్రామీణ బడ్జెట్

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం పార్లమెంట్‌కు సమర్పించిన బడ్జెట్‌లో తనదైన వైఖరికి విరుద్ధంగా గ్రామీణ రంగానికి, వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. మధ్య తరగతిని, కార్పొరేట్ రంగాన్ని విస్మరించారు. ఉద్యోగులను, పన్ను చెల్లింపుదారులను పెద్దగా కరుణించలేదు. ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయకుండా అద్దె ఇళ్లలో నివసించే ఉద్యోగులను కాస్త కరుణించారు. ఇంటి అద్దెలో ఏడాది పన్ను మినహాయింపును 24 వేల రూపాయల నుంచి 60 వేల రూపాయలకు పెంచారు. ఏడాదికి ఐదు లక్షల రూపాయలలోపు ఆదాయం కలిగి తక్కువ పన్ను చెల్లించే వారికి ఏడాది పన్నులో రెండు వేల రూపాయలు ఇస్తున్న మినహాయింపును ఐదు వేల రూపాయలకు పెంచారు. రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గ్రామీణ రంగానికి, పేదల ప్రయోజనాలకు పెద్ద పీట వేశారన్నది విశ్లేషకుల వాదన.
 

 బడ్జెట్‌లో మొత్తం వ్యయం కేటాయింపులను 19.78 లక్షల కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. అందులో ప్రణాళిక వ్యయం కింద 5.50 లక్షల కోట్ల రూపాయలను సూచించగా, ప్రణాళికేతర వ్యయం కింద 14.28 లక్షల కోట్ల రూపాయలు పేర్కొన్నారు. మొత్తంగా గ్రామీణ రంగానికి 87, 765 కోట్ల రూపాయలను కేటాయించగా, అందులో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మున్నెన్నడు లే ని విధంగా ఏకంగా 38,500 కోట్ల రూపాయలను కేటాయించారు. కేంద్ర ఆర్థిక సర్వే సూచించినట్లుగా వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తూ 35,984 కోట్ల రూపాయలను కేటాయించారు. వ్యవసాయ రుణాల టార్గెట్‌ను 9లక్షల కోట్ల రూపాయలుగా నిర్దేశించారు. రుణాల మాఫీకి ఐదు వేల కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ ఏడాది దేశంలో 5లక్షల ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కృష్ వికాస్ యోజన పథనాన్ని ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించారు. 2022 నాటికి వ్యవసాయదారుడి ఆదాయం రెట్టింపు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ కింద ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ప్రత్యేక నిధులను కేటాయించారు.
 

 మౌలిక సౌకర్యాల మెరగుపర్చడంలో భాగంగా గ్రామీణ, రాష్ట్ర, జాతీయ రోడ్ల అభివృద్ధికి 97 వేల కోట్ల రూపాయలను కేటాయించారు. రైలు, రోడ్డు పనుల మొత్తానికి 2.18 లక్షల కోట్ల రూపాయలను కేటాయించారు. ఇంకా దేశంలో కరంట్ సౌకర్యానికి నోచుకోని గ్రామాలు వేల సంఖ్యలో ఉన్నాయని అరుణ్ జైట్లీ చెబుతూ 2018 నాటికి నూటికి నూరు శాతం గ్రామాలను విద్యుదీకరిస్తామని చెప్పారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న పేద ప్రజలకు సబ్సీడీపై వంటగ్యాస్‌ను సరఫరా చేసేందుకు రెండు వేల కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించారు. 60 ఏళ్లు వయస్సు దాటిని వారికి 30 వేల రూపాయల అదనపు బీమా సౌకర్యాన్ని కల్సిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోస 5,500 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. యువత ఉపాధి అవకాశాలను పెంచేందుకు దేశంలో 1700 కోట్ల రూపాయలతో 1500 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి మూడేళ్లపాటు వారి పింఛను పథకానికి 8.33 శాతం చొప్పున ప్రభుత్వం తనవంతు వాటాగా చెల్లించనున్నట్టు బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
 

 అరుణ్ జైట్లీ సంపన్నులను కరణించకపోగా సర్‌చార్జీల పేరిట వారిపై పన్ను భారాన్ని మోపారు. డీజిల్, ప్రెటోలు కార్లపై, ఖరీదైన వస్తువులపై పన్నులు పెంచారు. పొగాకు ఉత్పత్తులపై పన్ను భారాన్ని పెంచారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలను వాణిజ్యంలో ప్రోత్సహించేందుకు 500 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. అధిక పన్నులతో సిమెంట్ ధరలు పెరగడం వల్ల మధ్య తరగతి ప్రజలపై భారం పడుతుంది. ఎరువుల ధరలు పెరగడం వల్ల ఎక్కువ భారం వ్యాపారస్థులపైనే పడుతుంది. కార్పొరేట్ రంగాన్ని కరుణించకపోవడంతో ఈ రోజు సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్లు పడిపోయింది. దేశంలో విమానాశ్రయాల అభివృద్ధికి ఒక్కోదానికి 100-150 కోట్ల రూపాయలను కేటాయించారు.
 

 ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంతో నడుస్తున్నప్పుడు భారత్ వ్యవస్థ బలంగానే కొనసాగుతోందని, దీన్ని మరింత బలోపేతం చేయడం కోసం ప్రస్తుత ఆర్థిక లోటును జాతీయ స్థూల ఉత్పత్తిలో 3.9 శాతాన్ని 3.5 శాతానికి ఏడాదిలో తగ్గిస్తామని అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు