మీటూ : సీనియర్‌ బీజేపీ నేతపై వేటు

4 Nov, 2018 15:02 IST|Sakshi
ఉత్తరాఖండ్‌ బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ కుమార్‌ (ఫైల్‌ఫోటో)

డెహ్రాడూన్‌ : మాజీ కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌ ఉదంతం తర్వాత మహిళను లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఎదుర్కొన్న మరో సీనియర్‌ బీజేపీ నేతపై ఆ పార్టీ వేటు వేసింది. ఉత్తరాఖండ్‌ రాష్ట్ర శాఖ బీజేపీ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ కుమార్‌ను లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో పదవి నుంచి పార్టీ కేంద్ర నాయకత్వం తప్పించింది. పార్టీ మహిళా కార్యకర్త చేసిన ఫిర్యాదు మేరకు సంజయ్‌ కుమార్‌పై బీజేపీ కేంద్ర నాయకత్వం చర్యలు చేపట్టిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ కేంద్ర నాయకత్వం ఉత్తరాఖండ్‌ రాష్ట్ర నేతలకు తెలిపారు. సంజయ్‌ కుమార్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లడైనప్పటి నుంచీ ఆయనపై చర్యలు చేపట్టాలని కోరుతూ ఉత్తరాఖండ్‌ అంతటా నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనల నేపథ్యంలో సంజయ్‌ను ఢిల్లీ పిలిపించిన అధిష్టానం ఆయనను పార్టీ పదవి నుంచి తప్పిస్తున్నట్టు తీసుకున్న నిర్ణయాన్ని వివరించింది.

ఉత్తరాఖండ్‌కు పార్టీ త్వరలోనే నూతన ప్రధాన కార్యదర్శిని ప్రకటిస్తుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌ గతంలో తాను పత్రికా సంపాదకుడిగా ఉన్న సమయంలో జర్నలిస్ట్‌ ప్రియా రమణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఇటీవల మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు