హిమాలయాల్లో ఓ పర్వతానికి వాజ్‌పేయ్‌ పేరు

29 Sep, 2018 09:06 IST|Sakshi
భారత మాజీ దివంగత ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి(ఫైల్‌ఫోటో)

డెహ్రడూన్‌ : భారత మాజీ దివంగత ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయికి అరుదైన గౌరవం దక్కింది. హిమాలయాల్లోని ఓ పర్వాతానికి వాజ్‌పేయి పేరును పెట్టనున్నట్లు ఉత్తరఖండ్‌ పర్యాటక శాఖ మంత్రి సత్పాల్‌ మహరాజ్‌ ప్రకటించారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘వాజ్‌పేయి వల్లనే ఉత్తరఖండ్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఆయన మా రాష్ట్ర ప్రజలకు చేసిన మేలును ఎన్నటికి మరవం. వాజ్‌పేయి ప్రకృతి ప్రేమికుడు. అడవులు, పర్వతాలు అంటే ఆయనకు చాలా ఇష్టం. అందువల్లే హిమలయాల్లోని ఓ పర్వతానికి వాజ్‌పేయి పేరు పెట్టాలని నిర్ణయించాం. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తాం’ అని తెలిపారు.

వాజ్‌పేయి మరణించిన తరువాత, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, మునిసిపల్ కార్పొరేషన్లు, నాయకులు కేంద్రం ఆమోదంతో మాజీ ప్రధాని గౌరవార్థం తమ తమ ప్రాంతాల్లోని అనేక ప్రదేశాల పేర్లను మార్చాలని  నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జార్ఖండ్ ప్రభుత్వం బీజేపీ నాయకుడి గౌరవార్థం రాష్ట్రంలోని ఏడు ప్రదేశాలకు వాజ్‌పేయి పేరు పెట్టబోతున్నట్లు ప్రకటించింది.

చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ త్వరలో నిర్మించబోయే చత్తీస్‌గఢ్ నూతన రాజధాని ‘నయా రాయ్‌పూర్‌’ను ‘అటల్ నగర్‌’గా మార్చనున్నట్లు ప్రకటించారు. ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు అటల్‌ బిహారి వాజ్‌పేయ్‌ ప్రధానిగా ఉన్న కాలంలోనే ప్రత్యేక రాష్ట్రాలుగా ఆవిర్భవించాయి.

మరిన్ని వార్తలు